
ఉరుగ్వేకు మెక్సికో షాక్
3-1తో ఘనవిజయం కోపా అమెరికా కప్
గ్లెండేల్ (అరిజోనా): చివరి ఐదు నిమిషాల్లో రెండు మెరుపు గోల్స్ సాధించిన మెక్సికో జట్టు ఉరుగ్వేకు షాక్ ఇచ్చింది. సోమవారం గ్రూప్ ‘సి’లో జరిగిన ఈ మ్యాచ్‌లో మెక్సికో 3-1తో నెగ్గింది. గాయంతో బాధపడుతున్న సూపర్ స్ట్రయికర్ లూయిస్ సారెజ్ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం ఉరుగ్వేను దెబ్బతీసింది. ఐదో నిమిషంలో ప్రత్యర్థి క్రాస్ షాట్‌ను అడ్డుకోబోయిన ఉరుగ్వే ఆటగాడు అల్వరో పెరీరా సెల్ఫ్ గోల్ చేయడంతో మెక్సికోకు 1-0 ఆధిక్యం లభించింది. ఆ తర్వాత గోల్స్ కోసం ఇరు జట్ల నుంచి తీవ్ర ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోయింది. దీనికి తోడు 45వ నిమిషంలో మటియాస్ వెసినో రెండో ఎల్లో కార్డ్‌కు గురై మైదానం వీడడంతో ఉరుగ్వే పది మందితోనే ఆడాల్సి వచ్చింది.
ద్వితీయార్ధం 58వ నిమిషంలో డీగో రోలన్ (ఉరుగ్వే) ఎడమకాలితో సంధించిన షాట్ తృటిలో మిస్ అయ్యింది. ఇక 73వ నిమిషంలో ఆండ్రెస్ గాండ్రాడోకు రిఫరీ రెడ్ కార్డ్ చూపించడంతో మెక్సికో కూడా పది మందితోనే ఆడింది. ఆ మరుసటి నిమిషంలోనే కార్లోస్ సాంచెజ్ అందించిన పాస్‌ను డీగో గాడిన్ హెడర్ గోల్‌తో ఉరుగ్వే 1-1తో సమంగా నిలిచింది. అయితే మ్యాచ్ డ్రా దిశగా వెళుతున్న తరుణంలో 85వ నిమిషంలో రాఫెల్ మార్క్వెజ్, ఇంజ్యూరీ సమయం (90+2)లో హెక్టర్ హెరేరా చేసిన గోల్స్‌తో మెక్సికో సంబరాల్లో మునిగింది. అంతకుముందు మ్యాచ్ ఆరంభంలో ఉరుగ్వే జాతీయగీతానికి బదులు చిలీ గీతం వినిపించడం వివాదాస్పదమైంది. దీంతో ఆటగాళ్లు గందరగోళానికి గురి కాగా నిర్వాహకులు జరిగినదానికి క్షమాపణలు తెలిపారు.
జమైకాపై వెనిజులా విజయం
షికాగో: వార్మప్ మ్యాచ్‌లో కోపా చాంపియన్ చిలీని కంగుతినిపించిన జమైకా తమ ప్రారంభ మ్యాచ్‌లో తడబడింది. గ్రూప్ ‘సి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో 1-0తో జమైకాపై వెని జులా నెగ్గింది. 15వ నిమిషంలో వెనిజులాకు జోసెఫ్ మార్టినెజ్ ఏకైక గోల్ అందించాడు.