
కోరీ అండర్సన్
కొత్త ఏడాది వేడుకలు ముందుగా మొదలయ్యే దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. ఈ ఏడాది ప్రపంచ క్రికెట్‌కు సంచలన ఆరంభం కూడా అక్కడే లభించింది. వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ చేసి... 17 సంవత్సరాల క్రితం ఆఫ్రిది నెలకొల్పిన రికార్డు (37 బంతుల్లో)ను తిరగరాశాడు.
ప్రళయకాల రుద్రుడిలా చెలరేగుతూ అండర్సన్ సృష్టించిన పరుగుల సునామీని వర్ణించడానికి ‘అద్భుతం’ కూడా చిన్నమాటే అవుతుందేమో..! కేవలం 47 బంతుల్లోనే అజేయంగా 131 పరుగులు చేసిన అండర్సన్ ధాటికి... 46 బంతుల్లోనే సెంచరీ చేసిన జెస్సీ రైడర్ సంచలన ఇన్నింగ్స్ కనపడకుండా పోయింది. మొత్తానికి కివీస్ ద్వయం సంచలన బ్యాటింగ్‌తో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది.
ఒకడు కొడితే బీభత్సం... ఇద్దరు కొడితే ప్రళయం....
అదే ఇద్దరూ కలిపి కొడితే...?
ఒకరిది వేగం... మరొకరిది బలం...
ఈ రెండూ కలిస్తే....?
కొత్త ఏడాది తొలి రోజున న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ కోరీ అండర్సన్, జెస్సీ రైడర్ క్రికెట్ మైదానంలో ప్రళయకాండ సృష్టించారు. బౌలర్ ఎవరైనా... బంతి ఎలాంటిదైనా... వాయు వేగంతో బౌండరీ లైన్ దాటించారు. ముఖ్యంగా అండర్సన్... ఆరు బంతులకో సిక్సర్ (సిక్సర్ టు సిక్సర్) చొప్పున వాయువేగంతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
ఎదుర్కొన్న మూడో బంతికే బౌండరీ సాధించిన అతను తొలి ఆరు బంతులను మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాడు. హోల్డర్ బౌన్సర్ వేసినా... నరైన్ గింగరాలు తిప్పినా... కళ్లు చెదిరే రీతిలో సిక్సర్ల వర్షం కురిపించాడు. 36 బంతుల్లోనే సెంచరీ కొట్టిన అండర్సన్ ఇన్నింగ్స్ మొత్తంలో 14 సిక్సర్లు బాదాడు. తద్వారా వన్డేల్లో మూడో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ (16), వాట్సన్ (15)లు ముందున్నారు. నరైన్ బౌలింగ్ (10.1 ఓవర్)లో డీప్ మిడ్ వికెట్‌లో కొట్టిన తొలి సిక్సర్‌కు బంతి మైదానం బయట పడితే... హోల్డర్ వేసిన బంతిని స్క్వేర్ లెగ్ మీద రోప్ దాటించాడు. ఇక తర్వాతి ఓవర్‌లో నరైన్‌ను ఉతికిపారేశాడు. డీప్ స్క్వేర్ లెగ్, లాంగాఫ్, డీప్ మిడ్ వికెట్ (2) మీదుగా నాలుగు సిక్సర్లు బాది 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రేవో బౌలింగ్‌లో లాంగాఫ్ మీదుగా మరో సిక్సర్ సంధిస్తే... రాంపాల్ వేసిన 15వ ఓవర్‌లో అండర్సన్ విశ్వరూపం చూపాడు. ఊహించని రీతిలో కళ్లు చెదిరే స్థాయిలో నాలుగు సిక్సర్లు కొట్టాడు. 95 పరుగుల వద్ద మిల్లర్ బౌలింగ్‌లో లాంగ్ లెగ్ మీద కొట్టిన సిక్సర్ అద్భుతం. ఫలితంగా 36 బంతుల్లో సెంచరీ ఫినిష్. దీంతో 1996లో ఆఫ్రిది (37 బంతుల్లో) నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. తర్వాత కూడా మరో రెండు సిక్సర్లు, మరో రెండు బౌండరీలు కొట్టి అజేయంగా నిలిచాడు.
మరోవైపు రైడర్ కూడా దూకుడుగా ఆడాడు. రెండో ఎండ్‌లో సహచరుడు చెలరేగుతుంటే అతను చూసి ఆగలేకపోయాడు. ఎక్కువగా బౌండరీలు కొట్టినా... హోల్డర్ ఒకే ఓవర్‌లో రెండు బలమైన సిక్సర్లతో మోత మోగించాడు. రాంపాల్, మిల్లర్, బ్రేవోలకు ఒక్కో సిక్సర్ రుచి చూపించాడు. తద్వారా 46 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని ఫాస్టెస్ట్ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.
‘అండర్సన్ చాలా చక్కటి షాట్లు ఆడాడు. ఆడిన తీరు చూస్తే గొప్ప బ్యాట్స్‌మన్ అవుతాడని అనిపిస్తోంది. ఈ ఇన్నింగ్స్ అతని కెరీర్‌ను మలుపు తిప్పవచ్చు. ఐపీఎల్‌లో అతను మా చెన్నై జట్టులో ఆడాలని కోరుకుంటున్నా. వేలంలో ధోని, కోచ్ ఫ్లెమింగ్ అతడిని తీసుకుంటారని ఆశిస్తున్నా’
-డ్వేన్ బ్రేవో,
వెస్టిండీస్ కెప్టెన్
‘ఇప్పటివరకు నేను అండర్సన్ పేరు కూడా వినలేదు. కొత్త సంవత్సరంలో మొదటి వార్తగా నా రికార్డు చెరిగిపోయిందని తెలిసింది. అయితే అదో అద్భుత ప్రదర్శన. 36 బంతుల్లో సెంచరీ చిన్న విషయం కాదు. నేను రిటైరయ్యే వరకు నా రికార్డు నిలిచి ఉంటుందని భావించాను. ఇప్పటివరకు ఆఫ్రిది అంటే ఆ రికార్డే అందరికీ గుర్తొచ్చేది. ఇప్పుడు అండర్సన్ పేరు వచ్చింది. టి20ల కారణంగా వేగం పెరిగిన ఈ రోజుల్లో ఈ రికార్డు కూడా ఎప్పుడైనా బద్దలవుతుందేమో’
- షాహిద్ ఆఫ్రిది, పాక్ క్రికెటర్
‘బ్యాటింగ్ చేసేటప్పుడు రికార్డు గురించి ఆలోచన లేదు. వేగంగా సెంచరీ చేయబోతున్నానని తెలుసు కానీ అదే ఫాస్టెస్ట్ సెంచరీ అవుతుందని నిజంగానే తెలీదు. నేను ఎదుర్కొన్న ప్రతీ బంతిని బాది వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడంపై దృష్టి పెట్టానే తప్ప రికార్డును మనసులో పెట్టుకునే తీరిక కూడా క్రీజ్‌లో లేదు. ఆఫ్రిది మళ్లీ విజృంభించి నా రికార్డును చెరిపేందుకు ప్రయత్నిస్తాడేమో’
- కోరీ అండర్సన్
బరువుతగ్గి... బాదాడు!
క్వీన్స్‌టౌన్ వన్డేకు ముందు 23 ఏళ్ల కోరీ అండర్సన్ ఆడింది ఆరు వన్డేలే...వాటిలో అత్యధిక స్కోరు 46! అయితే ఒక్క ఇన్నింగ్స్ ఇప్పుడు అతని పేరు మార్మోగేలా చేసింది. ధాటిగా బ్యాటింగ్‌తో పాటు లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేసే ఈ ఆల్‌రౌండర్ ఇటీవల న్యూజిలాండ్ భవిష్యత్ తారగా వెలుగులోకి వచ్చిన కొత్త కుర్రాళ్లలో ఒకడు. 59 ఏళ్ల న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో 16 ఏళ్ల వయసులోనే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన ఇతను అదే వయసులో బోర్డు కాంట్రాక్ట్ పొందిన పిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందాడు.
అయితే ఆ తర్వాత వరుస గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో సరిగా ఆడలేకపోయాడు. 2008, 2010 అండర్-19 ప్రపంచకప్‌లలో అతను కివీస్ తరఫున ఆడాడు. 2010, 11 సంవత్సరాల్లో బరువు పెరిగి బాగా లావుగా తయారై ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆట దెబ్బతింది. దీంతో 2012లో ఫిట్‌నెస్‌పరంగా తీవ్రంగా శ్రమించి 20 కిలోల బరువు తగ్గి... మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు.దేశవాళీ మ్యాచ్‌ల్లో శరవేగంగా పరుగులు చేయడం మొదలుపెట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తొలి సెంచరీ చేశాడు.
దీంతో అతనికి జాతీయ టి20 జట్టులో పిలుపు లభించింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కూడా ఎంపికైనా ప్రాక్టీస్‌లో గాయం కావడంతో తిరుగు ముఖం పట్టాల్సి వచ్చింది. అయితే జూన్‌లో చాంపియన్స్ ట్రోఫీలో అతను తొలి వన్డే అవకాశం దక్కింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీ సాధించడంతో తొలిసారి అండర్సన్‌కు గుర్తింపు లభించింది. ఆ తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పదునైన స్వింగ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మరో సారి ఫిట్‌నెస్ సమస్యలు రాకుంటే అండర్సన్ కివీస్‌కు ఉపయుక్తమైన ఆల్‌రౌండర్ కాగలడు.
ఓ కన్నేయాలి...: భారత జట్టు తమ తర్వాతి సిరీస్‌లో న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపైనే ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో అండర్సన్ కీలక ఆటగాడు అయ్యే అవకాశం ఉంది. నిలకడగా 140 కిమీ వేగంతో బౌలింగ్ కూడా చేస్తున్న కోరీని రెండు రంగాల్లోనూ ఎదుర్కునేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. ఈ ఇన్నింగ్స్ కచ్చితంగా అండర్సన్‌ను ఐపీఎల్ వేలానికి ముందు స్టార్‌ని చేసింది. కాబట్టి తనకి ఐపీఎల్‌లో డిమాండ్ బాగా ఎక్కువగా ఉండొచ్చు.
- సాక్షి క్రీడావిభాగం