మీరే విచారించండి
ముద్గల్ కమిటీ నివేదికపై బీసీసీఐకి సుప్రీం కోర్టు ఆదేశం
ఐపీఎల్ సీఓఓగా సుందర్‌రామన్ కొనసాగింపు
అధ్యక్షుడిగా కొనసాగుతానన్న శ్రీనివాసన్ విజ్ఞప్తి తిరస్కరణ
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించిన ముద్గల్ కమిటీ నివేదికపై విచారణ జరపాలని బీసీసీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. తద్వారా బోర్డు సంస్థాగత స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలని సూచించింది. అయితే ముద్గల్ కమిటీ ఆరోపణలు చేసిన వారిని కోర్టు విడిచిపెట్టబోదని స్పష్టం చేసింది. ఫిక్సింగ్ కేసును ‘సిట్’ లేదా ‘సీబీఐ’కి అప్పగించలేమని కేసును విచారించిన జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ వెల్లడించింది.
‘బోర్డుకు ఉన్న స్వయం ప్రతిపత్తిని కాపాడాలి. ఓ కమిటీని ఏర్పాటు చేసి ఈ కేసును పరిశీలించాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోకుండా మేం ఉండలేం. దేశంలో క్రికెట్‌పై దృష్టిపెట్టాలి తప్ప వ్యక్తులపై కాదు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో వచ్చిన ప్రతి ఆరోపణను శ్రీనివాసన్ దృష్టికి తీసుకెళ్లారని ముద్గల్ కమిటీ నివేదించింది. కానీ ఆయన ఎలాంటి సీరియస్ చర్యలు తీసుకోలేదు’ అని సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
సుందర్ రామన్‌కు ఊరట
మరోవైపు ఐపీఎల్-7 నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు... చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా సుందర్ రామన్‌ను కొనసాగించొచ్చని ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ ఇచ్చిన రాతపూర్వక నివేదికను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
ముద్గల్ కమిటీ ముందు భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని, శ్రీనివాసన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ల టేపులను పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలన్న బీసీసీఐ అభ్యర్థనకు కోర్టు సమ్మతించింది. తనను బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగించొద్దన్న తీర్పును పునఃసమీక్షించాలన్న శ్రీనివాసన్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ముద్గల్ కమిటీ ఇచ్చిన రహస్య నివేదికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 13వ వ్యక్తిగా శ్రీనివాసన్ పేరుందని చెప్పిన కోర్టు... ఆయనపై 12 రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిపింది.
బోర్డు నియమావళిని పరిశీలిస్తాం
ఈ కేసుకు సంబంధించి నిర్మాణాత్మక చర్యలతో ఈనెల 22న మరోసారి కోర్టుకు హాజరుకావాలని ఆదేశించిన బెంచ్... ఐపీఎల్ నిబంధనలపై లోతుగా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి.
బీసీసీఐ అధ్యక్షుడికి ఐపీఎల్ జట్టు ఉండటం, ఐసీసీ సమావేశాల్లో బోర్డు ప్రతినిధిగా శ్రీనివాసన్ పాల్గొనే అంశాలపై బోర్డు నియమావళిని పరిశీలిస్తామని పట్నాయక్ తెలిపారు. చెన్నై పోలీసు అధికారి జి.సంపత్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయనున్నారు. అలాగే డెక్కన్ చార్జర్స్ జట్టు కూడా తమపై విధించిన నిషేధం గురించి అదే రోజున సుప్రీం ముందు వాదనలు వినిపించే అవకాశం ఉంది.
అత్యవసర సమావేశం పెట్టండి
శివలాల్‌కు ఆర్‌సీఏ లేఖ
సుప్రీం కోర్టులో స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) కోరింది. ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌కు ఆర్‌సీఏ కార్యదర్శి కేకే శర్మ లేఖ రాశారు. సుప్రీం కోర్టులో బోర్డు తరఫున హాజరయ్యే న్యాయవాదికి సలహాలు, సూచనలు ఎవరు ఇస్తున్నారో తమకు అర్థం కావడంలేదన్నారు. కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల బోర్డు, ఆటగాళ్ల ప్రతిష్ట దెబ్బతింటుంది కాబట్టి ఈనెల 20న అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. ఆర్‌సీఏతో పాటు ఐదారు అసోసియేషన్లు కూడా ఇదే తరహాలో బోర్డుకు లేఖలు సంధించాయి.