న్యూఢిల్లీ: ఇప్పటికే అవినీతి ఆరోపణలు, ఆటగాళ్ల ఎంపికలో నిబంధనల ఉల్లంఘనలతో అప్రతిష్ఠ పాలైన ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో మరో అవాంఛనీయ ఘటన. ఢిల్లీ అండర్–23 జట్టులోకి తన ఎంపికను తిరస్కరించినందుకు కక్ష పెంచుకున్న అనూజ్ దేడా అనే యువకుడు ఏకంగా... భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, డీడీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారిపై సోమవారం గుంపుతో కలిసి వచ్చి దాడికి దిగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం స్థానిక సెయింట్ స్టీఫెన్స్ మైదానంలో సాగుతున్న ఢిల్లీ సీనియర్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను భండారి పరిశీలిస్తుండగా హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో అనూజ్ బృందం దాడికి తెగబడింది. వీరిలో ఒకడు తుపాకీతో బెదిరించాడు. దీంతో భండారి పారిపోయేందుకు యత్నించినా వెంటాడి మరీ కొట్టారు. తల, చెవి భాగంలో గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేలోగా నిందితులు పారిపోయారు.
పరిస్థితిని గ్రహించిన క్రికెటర్లు అడ్డుకునేందుకు ముందుకొచ్చారు. ఎవరూ కలుగజేసుకోవద్దంటూ నిందితులు తుపాకీ చూపించి బెదిరించారు. మరోవైపు అనూజ్ విషయంలో భండారి నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. నవంబరులో 79 మందితో డీడీసీఏ విడుదల చేసిన అండర్– 23 ప్రాథమిక జాబితాలో అతడి పేరున్నా, ప్రదర్శన బాగోలేకపోవడంతో పక్కన పెట్టారు. అనూజ్ 1995 నవంబరు 22న జన్మించడంతో ఎంపికకు అర్హుడు కాలేకపోయాడు. 40 ఏళ్ల అమిత్ భండారి దేశానికి 2000–2004 మధ్య రెండు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరఫున రంజీల్లో 95 మ్యాచ్‌లాడి 314 వికెట్లు తీశాడు. దాడిని మాజీ క్రికెటర్లు బిషన్ సింగ్ బేడీ, గౌతమ్ గంభీర్ తీవ్రంగా ఖండించారు. భండారిపై దాడికి పాల్పడిన అనూజ్ దేడాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
ఢిల్లీ చీఫ్ సెలక్టర్ అమిత్ భండారిపై దాడి
Published Tue, Feb 12 2019 12:01 AM | Last Updated on Tue, Feb 12 2019 12:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment