మెక్‌గ్రాత్‌ సరసన కమిన్స్‌ | Cummins Joins McGraths Best Rating Points For Australia | Sakshi
Sakshi News home page

మెక్‌గ్రాత్‌ సరసన కమిన్స్‌

Published Tue, Sep 10 2019 3:41 PM | Last Updated on Tue, Sep 10 2019 4:50 PM

Cummins Joins McGraths Best Rating Points For Australia - Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో భాగంగా బ్యాటింగ్‌ విభాగంలో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ తన నంబరన్‌ వన్‌ ర్యాంకును నిలుపుకున్నాడు. ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని అధిగమించి టాప్‌ ర్యాంకును కైవసం చేసుకున్న స్మిత్‌ దాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం స్మిత్‌ 937 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలుపుకోగా, విరాట్‌ కోహ్లి 903 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే తన టెస్టు కెరీర్‌ అత్యుత్తమ రేటింగ్‌ పాయింట్లను అందుకునేందకు స్మిత్‌ స్వల్ప దూరంలో నిలిచాడు. 2017లో స్మిత్‌ 947 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ను దక్కించుకోగా, ఆపై ట్యాంపరింగ్‌ వివాదం కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురి కావడంతో టాప్‌ను కోల్పోయాడు. ఈ క్రమంలోనే దాన్ని కోహ్లి ఆక్రమించాడు.

కాగా, యాషెస్‌ సిరీస్‌ ద్వారా తన టెస్టు పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న స్మిత్‌ తన కెరీర్‌ అత్యధిక రేటింగ్‌ పాయింట్లుకు కేవలం 10 పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. యాషెస్‌ సిరీస్‌లో ఇప్పటివరకూ స్మిత్‌ 671 పరుగులు సాధించడంతో టాప్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే ఓవరాల్‌గా బ్యాట్స్‌మెన్‌ విభాగంలో అత్యధిక రేటింగ్‌ పాయింట్లను సాధించేందుకు స్మిత్‌ 25 రేటింగ్‌ పాయింట్ల దూరంలో ఉన్నాడు. 1948లో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ సర్‌ బ్రాడ్‌మన్‌ 961 రేటింగ్‌ పాయింట్లు సాధించాడు. ఇదే నేటికి రేటింగ్‌ పాయింట్ల పరంగా టెస్టుల్లో అత్యధికం.

ఇక బౌలింగ్‌ విభాగంలో ఆసీస్‌ పేసర్‌ కమిన్స్‌ టాప్‌ను పదిలం చేసుకున్నాడు. 914 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. అయితే ఆసీస్‌ తరఫున రేటింగ్‌ పాయింట్ల పరంగా మెక్‌గ్రాత్‌ సరసన నిలిచాడు కమిన్స్‌.  2001లో మెక్‌గ్రాత్‌ 914 రేటింగ్‌ పాయింట్లే ఆసీస్‌ తరఫున టెస్టుల్లో అత్యధికం. ఇప్పుడు అతని సరసన కమిన్స్‌ స్థానం సంపాదించాడు. యాషెస్‌ సిరీస్‌లో కమిన్స్‌ అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో తన రేటింగ్‌ పాయింట్లను మెరుగుపరుచుకున్నాడు. నాల్గో టెస్టులో కమిన్స్‌ ఏడు వికెట్లు సాధించడం అతని రేటింగ్‌ పాయింట్లు పెరగడానికి ప్రధాన కారణమైంది. ఓవరాల్‌గా చూస్తే కమిన్స్‌ 914 రేటింగ్‌ పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. 1914లో  ఇంగ్లండ్‌ బౌలర్‌ సిడ్నీ బార్న్స్‌  సాధించిన 932 రేటింగ్‌ పాయింట్లే ఇప్పటివరకూ టెస్టు ఫార్మాట్లో అత్యధికం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement