వార్నర్ సెంచరీ
సెయింట్ కిట్స్: ఇటీవల సూపర్ ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ మరోసారి మెరిశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వార్నర్.. ముక్కోణపు వన్డే సిరీస్లో కూడా తనదైన ముద్రతో చెలరేగిపోతున్నాడు. దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్లో వార్నర్(109;120 బంతుల్లో 11ఫోర్లు, 2 సిక్సర్లు) శతకం సాధించి ఆస్ట్రేలియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా ఆదిలో అరోన్ ఫించ్(13) వికెట్ ను కోల్పోయింది. అనంతరం వార్నర్, ఉస్మాన్ ఖాజాల జోడి ఆస్ట్రేలియా స్కోరును ముందుకు తీసుకెళ్లింది. ఒకవైపు వార్నర్ తనదైన దూకుడును ప్రదర్శిస్తే, మరో ఎండ్లో ఖాజా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి రెండో వికెట్కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే వార్నర్, ఖాజా(59;71 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) లు స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో ఆస్ట్రేలియా కాస్త తడబడినట్లు కనిపించింది. కాగా, స్టీవ్ స్మిత్(52;49 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) ఆకట్టుకోవడంతో ఆస్ట్రేలియా రన్ రేట్లో వేగం తగ్గలేదు.
ఇక చివర్లో వేడ్(24;14 బంతుల్లో 3ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఆసీస్ విసిరిన 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీలు 47.4 ఓవర్లలో 252 పరుగులకు మాత్రమే పరిమితమై 36 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో హషీమ్ ఆమ్లా(60), డు ప్లెసిస్(63), జేపీ డుమినీ(41), ఏబీ డివిలియర్స్(39)లు రాణించినా జట్టును ఓటమి నుంచి గట్టించలేకపోయారు. ఈ ముక్కోణపు సిరీస్లో ఇప్పటివరకూ ఆస్ట్రేలియా రెండు విజయాలు సాధించగా,దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లు తలో గెలుపుని నమోదు చేశారు.