పాక్‌పై గెలిస్తే కార్లు ఇస్తానన్న ‘డాన్’ : వెంగ్‌సర్కార్
ముంబై: 1986 ఆస్ట్రేలియా కప్ ఫైనల్ మ్యాచ్.. భారత్, పాకిస్థాన్ మధ్య పోరు.. మ్యాచ్‌కు ముందు రోజు అంతటా ఉద్విగ్న వాతావరణం.. ఈ దశలో ఓ వ్యక్తి భారత జట్టు డ్రెస్సింగ్ రూంలో అడుగుపెట్టి ఆటగాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. పాక్‌పై గెలిస్తే ఒక్కొక్కరికి ఒక్కో టొయోటా కరోలా కారు ఇస్తానని చెప్పాడు. ఇంతలో కెప్టెన్ కపిల్ దేవ్ ఆ గదిలోకి ప్రవేశించి జరిగింది తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆఫర్ చేసిన వ్యక్తిని గెట్ అవుట్ అంటూ బయటికి వెళ్లగొట్టాడు... అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో కెళ్లి బిజినెస్‌మేన్ అని పరిచయం చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు.. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ క్రి మినల్‌గా ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం. ఈ విషయాన్ని భారత జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ జల్గావ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
‘నటుడు మెహమూద్ ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు. ఆయనే దావూద్‌ను షార్జాలో పెద్ద వ్యాపారిగా మాకు పరిచయం చేశారు. అయితే అప్పుడు కపిల్ అక్కడ లేడు. విలేకరుల సమావేశం కోసం వెళ్లాడు. మాలో ఎవరూ దావూద్‌ను గుర్తుపట్టలేదు. ఫైనల్లో గెలిస్తే ప్రతి ఒక్కరికీ కారు ఇస్తానని అన్నాడు’ అని వెంగ్‌సర్కార్ వివరించారు. మరోవైపు ఈ విషయాన్ని అప్పటి జట్టు మేనేజర్ జయవంత్ లెలే రాసిన పుస్తకంలోనూ పేర్కొన్నారు. అయితే ఆ మ్యాచ్‌లో జావేద్ మియాందాద్ చివరి బంతికి సిక్స్ కొట్టి భారత అభిమానులకు ‘ఎప్పటికీ’ గుర్తుండిపోయే షాకిచ్చాడు.
ఆఫర్ గురించి తెలీదు: కపిల్
వెంగ్‌సర్కార్ చెప్పిన విషయాలు మీడియాలో రాగానే వెంటనే కపిల్ దేవ్ స్పందించారు. దావూద్ ఆఫర్ గురించి తనకేమీ తెలీదని చెప్పారు. ‘నేనెవరినీ కలుసుకోలేదు. అలాంటి విషయాలు ఎవరైనా చెబితే వారు అబద్ధమాడినట్టే. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఓ వ్యక్తి వచ్చిన మాట నిజమే. షార్జాలో మ్యాచ్ సందర్భంగా ఆ వ్యక్తి మా ఆటగాళ్లతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని గమనించాను. అయితే బయటివారు లోపలికి రాకూడదని, వెంటనే వెళ్లిపోవాల్సిందిగా చెప్పాను. దీనికి అతడు మరుమాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక కార్ల ఆఫర్ గురించి నాకైతే తెలీదు. ఒకవేళ వెంగ్‌సర్కార్ ఆ విషయం చెబితే ఆయనకే ఈ విషయంలో ఎక్కువ తెలిసుంటుంది’ అని కపిల్ స్పందించారు. ఆ తర్వాత అతడు దావూద్ ఇబ్రహీం అని, ముంబై స్మగ్లర్ అంటూ ఎవరో చెబితో తెలిసిందని అన్నారు.