![Deeply hurt by Vengsarkar's comments, says N. Srinivasan - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/10/SRINIVASAN.jpg.webp?itok=fIIFRdGV)
చెన్నై : ‘విరాట్ కోహ్లిని 2008లో టీమిండియాకు ఎంపిక చేయడాన్ని నేను ఇష్టపడలేదని మాజీ చీఫ్ సెలెక్టర్ వెంగ్‌సర్కార్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. అసలు అతడు ఎవరి తరఫున, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? ఇదంతా అబద్ధం’ అని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ శుక్రవారం ఖండించారు. శ్రీనివాసన్ బీసీసీఐ కోశాధికారిగా ఉన్న సమయంలో బద్రీనాథ్‌ను తీసుకోవాలని పట్టుబట్టినా తాను వినకపోవడంతో చీఫ్ సెలెక్టర్ పదవిని కోల్పోయానని బుధవారం వెంగ్‌సర్కార్ వ్యాఖ్యానించాడు. దీనిపై శ్రీనివాసన్ స్పందించారు. ‘ఒక క్రికెటర్ ఈ రకంగా మాట్లాడటం మంచిది కాదు. వెంగ్‌సర్కార్‌ను ముందుగానే తప్పించామనడం తప్పు. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించడంలో అర్థం లేదు. జట్టు ఎంపికలో నేను జోక్యం చేసుకునేవాడిని కాదు. అతడు చెప్పిన ఇద్దరు ఆటగాళ్లు (కోహ్లి, బద్రీనాథ్) 2008 శ్రీలంక సిరీస్‌లో ఆడారన్న విషయం గుర్తుంచుకోవాలి.
2008లో కొత్త కమిటీలు ఏర్పాటు చేయాల్సిన తరుణంలో బోర్డు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముంబై క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడిగా వెళ్లేందుకే వెంగ్‌సర్కార్ మొగ్గుచూపాడు. అందుకే సెలెక్షన్ కమిటీలో చోటుకు పరిగణనలోని తీసుకోలేదు. వివాదం సృష్టించేందుకే ఇలా మాట్లాడినట్లున్నాడు. ఇదంతా నిరాధారం’ అని శ్రీనివాసన్ వివరించారు. ‘అతడితో నాకు శత్రుత్వం ఏమీ లేదు. నా చొరవ కారణంగా ప్రోత్సాహకాలు దక్కిన మాజీ క్రికెటర్లలో వెంగ్‌సర్కార్ ఒకడు. 1994లో వెంగీ బెనిఫిట్ మ్యాచ్ కోసం ఇండియా సిమెంట్స్ లక్ష రూపాయలు ఇచ్చింది. అతను ఆడిన దాదర్ క్లబ్‌లో సౌకర్యాలు మెరుగుపర్చేందుకు మేం పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం నాకు బాగా గుర్తుంది. క్రికెటర్‌గా కల్నల్ అంటే గౌరవం ఉంది. అతడిని మేం ఒక జాతీయ హీరోగా చూశాం. ఇలా మాట్లాడటం దురదృష్టకరం’ అని శ్రీనివాసన్ స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment