ఢిల్లీ బుల్లెట్‌లా... | Delhi Daredevils chased down the second highest target in IPL | Sakshi
Sakshi News home page

ఢిల్లీ బుల్లెట్‌లా...

Published Fri, May 5 2017 12:42 AM | Last Updated on Tue, Aug 21 2018 2:46 PM

ఢిల్లీ బుల్లెట్‌లా... - Sakshi

ఢిల్లీ బుల్లెట్‌లా...

లయన్స్‌పై డేర్‌డెవిల్స్‌ విజయం
209 లక్ష్యాన్ని ఊదేసిన వైనం
రిషభ్‌ పంత్, సామ్సన్‌ మెరుపులు  
ఐపీఎల్‌లో రెండో అత్యధిక ఛేదన


కొండంత లక్ష్యం యువ సత్తా ముందు చిన్నబోయింది. సిక్సర్ల జడివానకు ఫిరోజ్‌ షా కోట్లా మైదానం వేదికైంది. రాకెట్‌ స్పీడ్‌తో రిషభ్‌ పంత్‌ (43 బంతుల్లో 97; 6 ఫోర్లు, 9 సిక్సర్లు), బుల్లెట్‌ వేగంతో సంజూ సామ్సన్‌ (31 బంతుల్లో 61; 7 సిక్సర్లు) లయన్స్‌ బౌలింగ్‌ను దడదడలాడించారు. దీంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ రెండున్నర ఓవర్ల ముందే 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. ఈ ఓటమితో లయన్స్‌ జట్టుకు ‘ప్లే ఆఫ్‌’ అవకాశాలు గల్లంతయ్యాయి.

న్యూఢిల్లీ: గుజరాత్‌ లయన్స్‌ గర్జనకు ఢిల్లీ బుల్లెట్‌ వేగంతో బదులిచ్చింది. సిక్సర్ల శివతాండవంతో అసాధ్యమనుకున్న లక్ష్యం సుసాధ్యమైంది. దీంతో ‘ప్లే–ఆఫ్‌’ వేట రసవత్తరం కాబోతోంది. రేసులో నిలవాలంటే ఇక ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిన తరుణంలో ఢిల్లీ కుర్రాళ్లు సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగారు. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో రిషభ్‌ పంత్, సంజూ సామ్సన్‌ల ధాటికి డేర్‌డెవిల్స్‌ 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ లయన్స్‌పై జయభేరి మోగించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లయన్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. తర్వాత ఈ భారీ లక్ష్యాన్ని ఢిల్లీ 17.3 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 214 పరుగులు చేసి ఛేదించింది. రిషభ్‌ పంత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో ఇది రెండో అత్యధిక ఛేదన కావడం విశేషం. 2008లో డెక్కన్‌ చార్జర్స్‌ (214/5)పై రాజస్థాన్‌ రాయల్స్‌ (217/7) నెగ్గడం అత్యుత్తమ ఛేజింగ్‌గా ఉంది.

బంతులా... చుక్కలా...: టార్గెట్‌ 209. ఎంత చెప్పినా కష్టసాధ్యమే. కానీ సుసాధ్యం చేశారు ఇద్దరు ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌. రిషభ్‌ పంత్, సంజూ సామ్సన్‌లు తమ బ్యాటింగ్‌ జోరుతో హోరెత్తించారు. అలుపే లేని సిక్సర్లతో బంతులు విలవిల్లాడితే, ధాటికి నిలువలేమని బౌలర్లు అలసిపోయారు. లయన్స్‌ కెప్టెన్‌ రైనా ఏకంగా ఏడుగురు బౌలర్లను రంగంలోకి దింపితే... ఒక్క స్మిత్‌ మినహా మిగతా ఆరుగురు బౌలర్లను సిక్సర్లతో ఆరేశారు. బ్యాటింగ్‌లో 208 పరుగులు చేసినప్పుడు... బౌలింగ్‌లో ఢిల్లీ జట్టు స్కోరు 24 వద్ద కరుణ్‌ నాయర్‌ (12) ఔటైనపుడు మాత్రమే గుజరాత్‌ శిబిరం సంబర పడింది. కానీ మిగిలిన ప్రతి నిమిషం ఢిల్లీదే! రిషభ్, సామ్సన్‌ రెండో వికెట్‌కు 63 బంతుల్లో 143 పరుగులు జోడించారు. మొదట పంత్‌ 27 బంతుల్లో, తర్వాత సామ్సన్‌ 24 బంతుల్లో అర్ధసెంచరీల్ని సాధించారు. వీళ్లిద్దరి వీర విధ్వంసానికి మ్యాచ్‌ ఏకపక్షంగా చేతిలోకొచ్చింది. 3 పరుగుల తేడాతో రిషభ్‌ సెంచరీ చేజార్చుకోవడం ఒక్కటే నిరాశ! శ్రేయస్‌ (14 నాటౌట్‌), అండర్సన్‌ (18 నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు.

రైనా, కార్తీక్‌ల మెరుపులు వృథా...
రైనాకు లభించిన లైఫ్‌లు లయన్స్‌ను గర్జించేలా చేసింది. రబడ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే ఓపెనర్లు మెకల్లమ్‌ (1), డ్వేన్‌ స్మిత్‌ (9) ఔటయ్యారు. ఈ ఓవర్లోనే శ్రేయస్‌ అయ్యర్‌.. రైనా క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పుడు రైనా 2 పరుగుల వద్దే ఉన్నాడు. తర్వాత దినేశ్‌ కార్తీక్‌తో జోరు పెంచిన రైనా... షమీ బౌలింగ్‌లో 6, 4, 4 బాదడంతో 15 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత 40 పరుగుల వద్ద రైనాకు మరో జీవదానం లభించింది. షమీ ఓవర్లో మిడ్‌వికెట్‌ వద్ద సామ్యూల్స్‌ క్యాచ్‌ను మిస్‌ చేశాడు. అనంతరం 32 బంతుల్లో రైనా అర్ధసెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు కార్తీక్‌ కూడా భారీ సిక్సర్లతో ఢిల్లీ బౌలింగ్‌ను తేల్చేశాడు. అతను 28 బంతుల్లోనే అర్ధసెంచరీ అధిగమించాడు. జట్టు స్కోరు 143 వద్ద లేని పరుగుకు ప్రయత్నించిన రైనా (43 బంతుల్లో 77; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రనౌట్‌ కాగా... కాసేపటికే దినేశ్‌ కార్తీక్‌ (34 బంతుల్లో 65; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు)ను కమిన్స్‌ పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత వచ్చిన వారిలో ఫించ్‌ (27), జడేజా (7 బంతుల్లో 18 నాటౌట్‌; 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో గుజరాత్‌ 200 పైచిలుకు పరుగులు చేసింది.

ఐపీఎల్‌లో నేడు
బెంగళూరు & పంజాబ్‌
వేదిక: బెంగళూరు; రా. గం. 8.00 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement