చివర్లో తారుమారు
- ఢిల్లీ అద్భుత విజయం
- ప్రొ కబడ్డీ లీగ్-2
కోల్‌కతా: చివరి సెకను దాకా నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ జట్టు పైచేయి సాధించింది. ఓటమి అంచుల్లో నుంచి విజయతీరాలకు చేరింది. ప్రొ కబడ్డీ లీగ్-2లో భాగంగా పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ దబాంగ్ 38-37తో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్ ముగియడానికి మరో 90 సెకన్లు ఉందనగా ఢిల్లీ 35-37తో వెనుకబడి ఉంది. ఈ దశలో రైడింగ్‌కు వచ్చిన కాశిలింగ్ అడకె ఒక పాయింట్ సాధించాడు. దాంతో తేడా ఒక పాయింట్‌కు తగ్గింది. ఆ తర్వాత పుణేరి పల్టన్ ఆటగాడు వజీర్‌సింగ్ రైడింగ్‌కు వచ్చినా ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లాడు.
మరోసారి రైడింగ్‌కు వచ్చిన కాశిలింగ్ ఈసారీ ఒక పాయింట్ సంపాదించడంతో స్కోరు 37-37తో సమమైంది. ఈ దశలో చివరి సెకన్లలో రైడింగ్‌కు వచ్చిన పుణేరి పల్టన్ ఆటగాడు వజీర్ సింగ్‌ను ఢిల్లీ జట్టు ఆటగాళ్లు పట్టుకోవడంతో ఆ జట్టు పాయింట్ తేడాతో విజ యాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా ఢిల్లీ రైడర్లు కాశిలింగ్ 12 పాయింట్లు, రోహిత్ కుమార్ చౌదరీ 11 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. పుణేరి జట్టులో కెప్టెన్ వజీర్ సింగ్ 13 పాయింట్లతో రాణించినా కీలకమైన చివరి రైడింగ్‌లో ప్రత్యర్థి జట్టుకు చిక్కి మూల్యం చెల్లించుకున్నాడు.
యు ముంబా జోరు: మరోవైపు గతేడాది రన్నరప్ యు ముంబా జట్టు తమ జోరును కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసి 25 పాయిం ట్లతో టాపర్‌గా ఉంది. బెంగాల్ వారియర్స్‌తో జరి గిన మ్యాచ్‌లో యు ముంబా 29-25తో గెలిచింది. విరామ సమయానికి 16-23తో వెనుకబడిన యు ముంబా రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకుంది. ఏకంగా 13 పాయింట్లు నెగ్గి, ప్రత్యర్థికి కేవలం రెండు పాయింట్లే ఇచ్చింది.
ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు
బెంగళూరు బుల్స్ x పుణేరి పల్టన్
రాత్రి గం. 8.00 నుంచి
బెంగాల్ వారియర్స్ x ఢిల్లీ దబాంగ్
రాత్రి గం. 9.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-2లో
ప్రత్యక్ష ప్రసారం