విజయీభవ! | Denmark Open Super Series Premier Tournament | Sakshi
Sakshi News home page

విజయీభవ!

Oct 17 2017 12:39 AM | Updated on Oct 17 2017 4:05 AM

Denmark Open Super Series Premier Tournament

ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు యూరోప్‌లో ‘సూపర్‌’ ప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం మొదలయ్యే డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నీలో... వచ్చే వారం జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత నెలలో ఆసియాలో జరిగిన కొరియా ఓపెన్‌లో పీవీ సింధు మహిళల సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గగా... జపాన్‌ ఓపెన్‌లో ప్రణవ్‌ చోప్రా–సిక్కి రెడ్డి జంట మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీఫైనల్‌కు చేరింది. ఇక యూరోప్‌లోనూ భారత క్రీడాకారులు ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి.

ఒడెన్స్‌ (డెన్మార్క్‌): మూడు వారాల విరామం తర్వాత భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ మళ్లీ మెరిపించేందుకు రెడీ అయ్యారు. మంగళవారం మొదలయ్యే డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్, అజయ్‌ జయరామ్, సమీర్‌ వర్మ బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌లో అనురా ప్రభుదేశాయ్‌... పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌లో పారుపల్లి కశ్యప్, శుభాంకర్‌ డే పోటీపడుతున్నారు. తొలి రౌండ్‌లో కిమ్‌ బ్రమ్‌ (డెన్మార్క్‌)తో శుభాంకర్‌; విక్టర్‌ స్వెండ్సన్‌ (డెన్మార్క్‌)తో కశ్యప్, ఇరీనా అండర్సన్‌ (డెన్మార్క్‌)తో అనురా ఆడతారు. తొలి రోజు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లతోపాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తొలి రౌండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.  

తొలి రౌండ్‌ దాటితే...
ఈ ఏడాది ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌తోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచిన సింధుకు... మాజీ చాంపియన్‌ సైనా నెహ్వాల్‌కు ఈ టోర్నీలో క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)తో సైనా... ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత చెన్‌ యుఫె (చైనా)తో సింధు ఆడతారు. ముఖాముఖి రికార్డులో సైనా, మారిన్‌ 4–4తో సమఉజ్జీగా ఉండగా... సింధు 2–1తో చెన్‌ యుఫెపై ఆధిక్యంలో ఉంది. ఒకే పార్శ్వంలో సైనా, సింధు ఉండటంతో క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని అధిగమిస్తే సెమీఫైనల్లో ఈ ఇద్దరు స్టార్స్‌ అమీతుమీ తేల్చుకుంటారు.  

శ్రీకాంత్‌ జోరు కొనసాగేనా!
మరోవైపు వరుసగా మూడు సూపర్‌ సిరీస్‌ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రెండింటిలో టైటిల్‌ నెగ్గిన శ్రీకాంత్‌ ప్రపంచ చాంపియన్‌షిప్, జపాన్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో ఆడనున్న శ్రీకాంత్‌కు క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) ఎదురయ్యే అవకాశముంది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో క్వాలిఫయర్‌తో సమీర్‌ వర్మ; లిన్‌ డాన్‌ (చైనా)తో అజయ్‌ జయరామ్‌; విటింగస్‌ (డెన్మార్క్‌)తో సాయిప్రణీత్‌; ఎమిల్‌ హోస్ట్‌ (డెన్మార్క్‌)తో ప్రణయ్‌ ఆడతారు. మంగళవారం జరిగే మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సామ్‌ మాగీ–చోల్‌ మాగీ (ఐర్లాండ్‌) జంటతో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా ద్వయం ఆడుతుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి; సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి జోడీలు... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట బరిలో ఉన్నాయి. 7,50,000 డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు 56,250 డాలర్ల (రూ. 36 లక్షల 40 వేలు) చొప్పున లభిస్తాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement