
కోల్‌కతా: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఓపెనర్లు కదం తొక్కారు. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన ఈ జోడీ రెండో ఇన్నింగ్స్‌లో లంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. తొలుత రాహుల్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై ధావన్ సైతం అర్థ శతకం నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ ఆడిన గత తొమ్మిది ఇన్నింగ్స్ ల్లో ఎనిమిదో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో అర్థ శతకంతో చెలరేగాడు. ఇది రాహుల్ కు టెస్టుల్లో 10వ హాఫ్ సెంచరీ.
జట్టు స్కోర్ 166 పరుగుల వద్ద శిఖర్ ధావన్ 94 ( 116 బంతులు 11ఫోర్లు, 2 సిక్సులు) దాసున్ షనక బౌలింగ్‌లో క్యాచ్ అవుటై తృటిలో శతకం చేజార్చుకున్నాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన166 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన చతేశ్వర పుజారాతో రాహుల్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్‌ను 15 నిమిషాల ముందే ముగించారు. ఇక నాలుగో రోజు ఆటముగిసే సరికి వికెట్ నష్టపోయి భారత్ 171 పరుగుల చేసి 49 పరుగుల ఆధిక్యం సాధించింది. క్రీజులో రాహుల్(73 నాటౌట్),పుజారా(2 నాటౌట్)లు ఉన్నారు.
అంతకుముందు శ్రీలంక జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 83.4 ఓవర్లలో 294 పరుగుల వద్ద ఆలౌటైంది. 165/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక.. మరో 35 పరుగులు జోడించిన తరువాత డిక్ వెల్లా(35) వికెట్ ను కోల్పోయింది. అటు స్వల్ప వ్యవధిలో ఆపై దాసున్ షనక(0), చండిమాల్ (28)సైతం అవుటయ్యారు ఈ మూడు వికెట్లు పరుగు వ్యవధిలో కోల్పోవడంతో అప్పటి వరకూ పటిష్ట స్థితిలో కనిపించిన లంక ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ఈ తరుణంలో రంగనా హెరాత్ బాధ్యతాయుతంగా ఆడాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు సాయంతో 67 పరుగులు జోడించాడు. తొమ్మిదో వికెట్ కు 46 పరుగులు జోడించిన తరువాత హెరాత్ పెవిలియన్ చేరాడు. భారత బౌలింగ్‌లో భువనేశ్వర్, షమీలకు నాలుగు వికెట్లు దక్కగా.. ఉమేశ్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment