ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం-2025 నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. పది జట్ల ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారుల మధ్య జూలై 31 నాటి సమావేశంలో ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫ్రాంఛైజీ యజమానుల్లో అధికులు ఆరుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరగా.. బీసీసీఐ ఇందుకు సానుకూలంగా స్పందించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు ఫ్రాంఛైజీలు మాత్రం తమ కెప్టెన్లను విడిచిపెట్టి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోవాలనే యోచనలో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఆర్సీబీ
ఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ సారథిని మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వేలానికి ముందు ఫాఫ్ డుప్లెసిస్‌ను విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 36 ఏళ్ల డుప్లెసిస్ ఐపీఎల్-2024లో 438 పరుగులు చేయడంతో పాటు.. జట్టును ప్లే ఆఫ్స్ వరకు చేర్చగలిగాడు.
అయితే, డుప్లెసిస్ వయసు రీత్యా కెప్టెన్‌గా అతడిని కొనసాగించేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని.. యువ టీమిండియా ఆటగాడిని సారథిగా నియమించుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.
పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ టాప్ రన్ స్కోర్లలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఒకడు. అయితే, పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న అతడు గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో ఆరంభ మ్యాచ్‌ల తర్వాత గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.
ధావన్ స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ పంజాబ్ కింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే, ప్లే ఆఫ్స్‌మాత్రం చేర్చలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.
ఇందుకు ప్రధాన కారణం సరైన నాయకుడు లేకపోవడమే. ఇక ధావన్ ఇప్పటికే జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాదు దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడటం లేదు. అలాంటి ఆటగాడిని సారథిగా కొనసాగించడంలో అర్థం లేదని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 38 ఏళ్ల ధావన్‌ను కెప్టెన్‌గా తప్పించి.. అతడి స్థానంలో యువ నాయకుడిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.
లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్‌లో 2022లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు మూడేళ్లుగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. 2022, 2023 సీజన్లలో లక్నోను టాప్-4లో నిలబెట్టిన రాహుల్.. 2024లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆటగాడినూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 520 పరుగులు చేసినప్పటికీ.. స్ట్రైక్‌రేటు(136.12) పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా ఓనర్ సంజీవ్ గోయెంకా రాహుల్‌పై బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత అంతా బాగానే ఉందని సంజీవ్ గోయెంకా సంకేతాలు ఇచ్చినా.. రాహుల్ మాత్రం బాగా హర్టయినట్లు సమాచారం. జట్టును వీడాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ సైతం రాహుల్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం.. ఆశిష్ నెహ్రాపై వేటు!
Comments
Please login to add a commentAdd a comment