అడిలైడ్: భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఇక్కడ జరిగే తొలి టెస్టుకు భారత కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని హాజరయ్యే అవకాశం ఉంది. ముందుగా ఖరారు చేసిన టీమిండియా ఆటగాళ్ల జాబితా ప్రకారం తొలి టెస్టులో ధోని పేరు లేదు. చేతికి గాయం కారణంగా 'బ్రిస్బేన్'టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ ధోని స్థానంలో తాత్కాలిక కెప్టెన్ గా విరాట్ కోహ్లీ పగ్గాలు చేపట్టాడు. అయితే ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా తొలి టెస్టు వేదిక బ్రిస్బేన్ నుంచి అడిలైడ్ కు మారింది. పాత షెడ్యూల్ ప్రకారం 12నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు జరగాల్సి ఉండగా... 4 వ తేదీ నుంచి బ్రిస్బేన్ లో తొలి టెస్టు జరగాలి.
ఇప్పుడు మెల్‌బోర్న్ మినహా మిగతా మూడు టెస్టు మ్యాచ్‌ల తేదీల్లో స్వల్ప మార్పులతో కొత్త షెడ్యూల్ ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది.గత రెండేళ్లుగా ఫిల్ హ్యూస్ సొంత మైదానంగా మార్చుకున్న అడిలైడ్‌లోనే సిరీస్ ప్రారంభించడం అతనికి నివాళిగా సీఏ భావిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మారిన షెడ్యూల్ సమీకరణాలు దృష్ట్యా ధోని అడిలైడ్ టెస్టుకు హాజరైనా.. ఆ టెస్టులో ఆడతాడా?లేదా అనేది దానిపై ఇంకా స్పష్టత రాలేదు.