
తొలి టెస్టు అడిలైడ్‌లో 9నుంచి
మూడు మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు
అడిలైడ్: ఫిల్ హ్యూస్ హఠాన్మరణంతో తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఎట్టకేలకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) టెస్టు సిరీస్‌పై స్పష్టత తీసుకు వచ్చింది. అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 9నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. పాత షెడ్యూల్ ప్రకారం 12నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు జరగాల్సి ఉండగా... ఇప్పుడు మెల్‌బోర్న్ మినహా మిగతా మూడు టెస్టు మ్యాచ్‌ల తేదీల్లో స్వల్ప మార్పులు జరిగాయి. సిరీస్ ప్రసారకర్త చానల్ 9 ముందుగా దీనిని ఖరారు చేయగా...ఆ తర్వాత సీఏ తమ వెబ్‌సైట్‌లో కొత్త షెడ్యూల్‌ను ఉంచింది. కొత్త షెడ్యూల్‌ను బీసీసీఐ కూడా ఖరారు చేసింది. 1976-77 తర్వాత ఓ సిరీస్‌లో అడిలైడ్ మొదటి టెస్టుకు వేదిక కానుండటం ఇదే తొలిసారి.
ప్రాక్టీస్ మ్యాచ్ కూడా...
గత రెండేళ్లుగా ఫిల్ హ్యూస్ సొంత మైదానంగా మార్చుకున్న అడిలైడ్‌లోనే సిరీస్ ప్రారంభించడం అతనికి నివాళిగా సీఏ భావిస్తోంది. కొత్త షెడ్యూల్ ప్రకారం 9 నుంచి అడిలైడ్‌లో, 17నుంచి బ్రిస్బేన్‌లో రెండో టెస్టు జరుగుతాయి. 26నుంచి మెల్‌బోర్న్‌లో మూడో టెస్టు, జనవరి 6నుంచి నాలుగో మ్యాచ్ సిడ్నీలో జరుగుతాయి. మొత్తం 33 రోజుల వ్యవధిలో నాలుగు టెస్టుల సిరీస్ ముగించే విధంగా షెడ్యూల్ సవరించారు. దీంతో మొదటి రెండు టెస్టుల మధ్య మూడు రోజులు...రెండు, మూడో టెస్టుల మధ్య నాలుగు రోజుల విరామం మాత్రమే లభించనుంది.
హ్యూస్ మృతితో రద్దయిన రెండో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా భారత్‌కు లభిస్తోంది. అడిలైడ్‌లో గురు, శుక్రవారాల్లో భారత్ ఈ మ్యాచ్ ఆడనుంది. అందువల్ల భారత ఆటగాళ్లు బ్రిస్బేన్‌కు వెళ్లకుండా అడిలైడ్‌లోనే ఆగిపోయారు. మరో వైపు గాయాలతో బాధపడుతున్న ఇరు జట్ల కెప్టెన్లు ఎంఎస్ ధోని, మైకేల్ క్లార్క్‌లకు కూడా కోలుకునేందుకు అవకాశం దక్కింది. దీంతో వీరిద్దరు కూడా తొలి టెస్టులో ఆడతారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఆసీస్ క్రికెటర్ల ప్రాక్టీస్ మొదలు
సహచరుడి ఆకస్మిక మృతినుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా మైదానం వైపు కదులుతున్నారు. బుధవారం జరిగే హ్యూస్ అంత్యక్రియల కోసం మైకేల్ క్లార్క్ ఇప్పటికే మాక్స్‌విలే చేరుకోగా, మిగతా న్యూసౌత్‌వేల్స్ జట్టు సభ్యులు మాత్రం ప్రాక్టీస్ ప్రారంభించారు. తొలి టెస్టు జట్టులో సభ్యులైన బ్రాడ్ హాడిన్, జోష్ హాజల్‌వుడ్ సోమవారం ఇతర ఆటగాళ్లతో కలిసి సాధన చేశారు.
అర్ధాంతరంగా ఆగిపోయిన ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ మ్యాచ్‌లను కూడా 9నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఏ ప్రకటించింది. హ్యూస్ గాయపడి ప్రాణాలు కోల్పోయిన మైదానంలోనే కొత్త షెడ్యూల్ ప్రకారం న్యూసౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ వారాంతంలో ఆసీస్ గ్రేడ్ క్రికెట్ రద్దు కాగా, దిగువ స్థాయిల్లో క్లబ్ క్రికెట్‌కు మాత్రం విరామం ఇవ్వలేదు.
కొనసాగుతున్న నివాళులు...
హ్యూస్‌ను అభిమానించే క్రికెటర్లు తమదైన శైలిలో దివంగత క్రికెటర్‌కు ఇంకా నివాళులు అర్పిస్తున్నారు. పెర్త్‌లో యూనివర్సిటీ జట్టు తరఫున ఆడుతూ అస్టిన్ అగర్ 98 పరుగులకు అవుటయ్యాడు. గత ఏడాది ట్రెంట్‌బ్రిడ్జ్‌లో తన తొలి టెస్టు మ్యాచ్‌లో కూడా 98 పరుగులే చేసిన అగర్... ఫిల్ హ్యూస్‌తో కలిసి చివరి వికెట్‌కు 163 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన ప్రదర్శనను ఇది గుర్తుకు తెస్తోంది.
విక్టోరియాలో జరుగుతున్న క్లబ్ మ్యాచ్‌లో స్థానిక క్రికెటర్ షాన్ ఆర్థర్ మరో తరహాలో హ్యూస్‌ను గుర్తు చేసుకున్నాడు. తమ జట్టు స్కోరు 63 ఓవర్లలో 408 పరుగులకు చేరగానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఆ సమయంలో 220 పరుగులతో ఆడుతున్న అతను మరో 11 పరుగులు చేస్తే అత్యధిక పరుగుల రికార్డు సృష్టించేవాడు. కానీ హ్యూస్ ఆఖరి ఇన్నింగ్స్, అతని టెస్టు నంబర్ రాగానే ఆర్థర్ మ్యాచ్ ముగించాడు.