సాక్షి, చెన్నై : ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలు చెన్నై సూపర్ కింగ్స్ పై ప్రభావం చూపబోవని టీమిండియా స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ పేర్కొన్నాడు. సుమారు రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ టీం తిరిగి ఐపీఎల్‌లో ఆడబోతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎస్‌కే తరపున చెన్నైలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ధోనీ ప్రసంగించాడు.
‘‘సీఎస్‌కే జట్టులో తప్ప మరో ఫ్రాంఛైజీకి ఆడాలనే ఆలోచన నాకు ఎన్నడూ రాలేదు. చెన్నై నాకు మరో ఇల్లు. ఇక్కడి అభిమానులు నన్ను ఎంతగానో ఆదరించారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో సత్తా చాటి తీరతాం. ఫిక్సింగ్ ఆరోపణలు మా బ్రాండ్‌పై ఎలాంటి ప్రభావం చూపించవు’’ అని ధోనీ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్న యువ ఆటగాళ్లు ఉన్నారని.. ఒకవేళ వేలంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు చేజారితే కుర్రాళ్లతోనే ముందుకు వెళ్లేందుకు సిద్ధమని ధోనీ తెలిపాడు.
కాగా, ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో లోథా కమిటీ నివేదిక ఆధారంగా చెన్నై సూపర్ కింగ్స్‌తోపాటు, రాజస్థాన్ రాయల్స్ లపై రెండేళ్ల పాటు బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే.
రజనీతో ధోనీ భేటీ...?
చెన్నై పర్యటనలో భాగంగా ఎంఎస్‌ధోనీ.. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి 9గంటలకు పోయెస్ గార్డెన్‌లోని రజనీ ఇంటికి ధోనీ వెళ్లనున్నాడన్న వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. వీరిద్దరు సమావేశం కావటం ఖాయమనే మీడియా కథనాలు చెబుతున్నాయి. రజనీ రాజకీయ అరంగ్రేటం నేపథ్యంలో ధోనీ ఆయనకు అభినందనలు తెలియజేసే అవకాశం ఉందని ఆయా కథనాల సారాంశం.
Comments
Please login to add a commentAdd a comment