ధోనీ కెప్టెన్సీ.. గతమెంతో ఘనం
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ ధోనీ అనూహ్య నిర్ణయం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మొన్నటిదాకా విజయవంతమైన కెప్టెన్గా మన్ననలందుకున్న ధోనీ అనూహ్యంగా టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఇటీవల టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవడం, ధోనీ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
2004లో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన ధోనీ ఆ మరుసటి ఏడాది 2005లో ధోనీ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడాడు. ధోనీ తన కెరీర్లో 90 టెస్టులు ఆడాడు. 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ధోనీ అత్యుత్తమ స్కోరు 224. ఆస్ట్రేలియాతో ఈ రోజు ముగిసిన మూడో టెస్టే ధోనీకి ఆఖరి మ్యాచ్.
ధోనీ సారథ్యంలో భారత్ ఎన్నో ఘనవిజయాలు సాధించింది. టెస్టు క్రికెట్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 60 టెస్టుల్లో భారత్కు నాయకత్వం వహించిన మహీ 27 మ్యాచ్ల్లో జట్టుకు విజయాలందించాడు. కాగా విదేశీ గడ్డపై భారత్ పరాజయాలు చవిచూడటంతో విమర్శలు వచ్చాయి. వన్డేల్లోనూ ధోనీ అద్భుతాలు చేశాడు. స్వదేశంలో జరిగిన గత వన్డే ప్రపంచ కప్లో భారత్ ధోనీ కెప్టెన్సీలోనే కప్ సొంతం చేసుకుంది. వన్డేల్లో 250 మ్యాచ్లు, పొట్టి క్రికెట్లో 50 మ్యాచ్లు ఆడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోనీ కొనసాగనున్నాడు.