ధోని వచ్చేస్తున్నాడు!
తొలి టెస్టు బరిలో కెప్టెన్
కోహ్లికి చేజారిన నాయకత్వ అవకాశం
హ్యూస్ అంత్యక్రియలకు ముగ్గురు భారత ఆటగాళ్లు
అడిలైడ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్టు మ్యాచ్ ఆడటం ఖాయమైంది. ఈ నెల 9నుంచి ఈ మ్యాచ్ అడిలైడ్‌లో జరగనుంది. చేతి గాయం కారణంగా జట్టుతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లని ధోని, ఇప్పుడు నేరుగా అడిలైడ్ చేరుకోనున్నాడు. ఈ విషయాన్ని టీమ్ మీడియా మేనేజర్ ఆర్.ఎన్. బాబా ధ్రువీకరించారు. తొలి టెస్టు ఆరంభానికి చాలా ముందుగానే ధోని జట్టుతో కలుస్తాడని ఆయన వెల్లడించారు.
వాస్తవానికి ఈ నెల 4నుంచి తొలి టెస్టు జరిగితే ధోని ఆడే అవకాశం లేకపోయేది. అయితే హ్యూస్ మరణంతో షెడ్యూల్‌లో మార్పు జరిగింది. దాంతో గాయంనుంచి కోలుకునేందుకు ధోనికి తగిన సమయం లభించింది. గురువారంనుంచి జరగాల్సిన భారత్ రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌కు మాత్రం మహి అందుబాటులో ఉండడు. అయితే తగినంత విరామం లభించినా... ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ తొలి టెస్టు ఆడతాడా, లేదా అనేదానిపై మాత్రం ఇంకా సందిగ్ధం వీడలేదు.
నమన్ ఓజా వెనక్కి!
భారత టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించేందుకు విరాట్ కోహ్లి మరికొన్నాళ్లు వేచి ఉండక తప్పేట్లు లేదు. అడిలైడ్ టెస్టుకు ధోని సిద్ధం కావడంతో కోహ్లికి నాయకత్వం అవకాశం పోయింది. మరో వైపు ధోని గైర్హాజరీలో ఒక టెస్టు కోసం రిజర్వ్ కీపర్‌గా వెళ్లిన నమన్ ఓజాకు కూడా నిరాశే ఎదురు కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో సాహా రూపంలో రిజర్వ్ కీపర్ ఉండటంతో ధోని రాకతో ఓజా స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంది. మరో వైపు మాక్స్‌విలేలో బుధవారం జరిగే హ్యూస్ అంత్యక్రియలకు భారత జట్టు తరఫున కోహ్లి హాజరు కానున్నాడు. మరో ఇద్దరు క్రికెటర్లు రోహిత్ శర్మ, మురళీ విజయ్‌లతో పాటు ఫ్లెచర్, రవిశాస్త్రి, మేనేజర్ అయూబ్ కూడా వెళుతున్నారు. వీరంతా అంత్యక్రియల్లో పాల్గొని ప్రాక్టీస్ మ్యాచ్ సమయానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడే చెప్పడం తొందరపాటు: సీఏ
తొలి టెస్టు కోసం తమ ఆటగాళ్లు మానసికంగా సిద్ధంగా ఉన్నారా? లేదా? అని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని సీఏ వెల్లడించింది. ‘సమయం వచ్చినప్పుడు జట్టులోని ప్రతి సభ్యుడు ఆడాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటారు. ప్రస్తుతం ఏ ఆటగాడూ ఆడేందుకు సుముఖంగా లేడు. క్రికెటర్లపై ఒత్తిడి తేవొద్దని వైద్య బృందం సలహా ఇచ్చింది. దీన్ని మేం పూర్తిగా అర్థం చేసుకున్నాం. అభిమానులు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం.
టెస్టు క్రికెట్ అనేది చాలా పెద్దది. రెండు గంటల్లో ముగిసేది కాదు’ అని సీఏ సీఈఓ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. టెస్టుకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌ను బట్టి తుది జట్టును ఎంపిక చేయడం ఆనవాయితీ అని చెప్పిన సదర్లాండ్ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వివరించారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత టెస్టు గురించి ఆలోచిస్తామన్నారు. మరోవైపు తొలి టెస్టులో తాను ఆడటంపై కచ్చితంగా హామీ ఇవ్వలేనని రేయాన్ హారిస్ తెలిపాడు.
తొలి రెండు వన్డేల షెడ్యూల్ మార్పు
భారత జట్టుకు తగినంత విశ్రాంతినివ్వడం కోసం క్రికెట్
ఆస్ట్రేలియా (సీఏ) ముక్కోణపు వన్డే సిరీస్ షెడ్యూల్‌లో కూడా స్వల్ప మార్పు చేసింది. సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత్ ఆడాల్సిన అవసరం లేకుండా దీనిని మార్చింది. పాత షెడ్యూల్ ప్రకారం జనవరి 16న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ ఇప్పుడు జనవరి 18కి మారింది. జనవరి 18న జరగాల్సిన ఆసీస్, ఇంగ్లండ్ మ్యాచ్‌ను రెండు రోజుల ముందుగానే సిరీస్‌లో తొలి వన్డేగా నిర్వహిస్తారు.