సీఈవోగా ధోనీ సడన్ సర్ ప్రైజ్
⇒ సరికొత్త అవతారంలో ధోనీ
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ కంపెనీకి సీఈవో అయ్యాడు. అదేంటీ.. క్రికెటర్ గా కొనసాగుతున్న మహీ కంపెనీ సీఈవోగా చేయడమేంటని ఆలోచిస్తున్నారా.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ 10 కోసం సన్నధ్దమైన పుణే సూపర్ జెయింట్స్ ఆటగాడు ఎంఎస్ ధోనీ సోమవారం ఓ కంపెనీకి ఒకరోజు సీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. ఒకేఒక్కడు మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ ఒకరోజు సీఎంగా వ్యవహరించినట్లే.. ధోనీకి ఒకరోజు సీఈవోగా చాన్స్ వచ్చింది.
బ్యాటింగ్ సమయంలో మైదానంలో ప్రత్యర్థి బౌలర్ల బంతులను స్టాండ్స్ లోకి పంపిస్తూ, ఫీల్డిండ్ సమయంలో కెప్టెన్ కూల్ గా ఇన్నిరోజులు వ్యవహరిస్తూ కనిపించిన ధోనీ.. సూట్ లో గల్ఫ్ ఆయిల్ ఇండియా కంపెనీకి వెళ్లాడు. సీఈవోగా కొత్త అవతారం ఎత్తాడు. సీఈవో కుర్చీలో ధోనీని చూసిన కంపెనీ ఉద్యోగులు షాక్ తిన్నారు. . ధోనీ స్నేహితుడు ఆ కంపెనీ కమర‍్షియల్ ఇంటరెస్ట్స్ మేనేజర్ అరుణ్ పాండే ఈ విషయాలను చెప్పారు. గతంలో ఈ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరించాడు. సీఈవోగా చేసిన ధోనీ.. కంపెనీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడని తెలిపారు. ఎన్నో రోజుల కిందటే ఈ విధంగా ప్లాన్ చేశామని.. అయితే ఇప్పుడు సాధ్యమైందని పాండే వివరించారు.