![Dhoni's Exit Will Leave a Void, says Gilchrist - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/3/MS%20Dhoni.jpg.webp?itok=DwpkbzDV)
న్యూఢిల్లీ:టీమిండియా క్రికెట్ ను ఉన్నత శిఖరాలకు చేర్చిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. భారత్ జట్టుకు అతని విశేష అనుభవం ఎంతో అమూల్యమైదంటూ కొనియాడాడు. అతని సేవల్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదంటూ ఈ సందర్బంగా గిల్లీ స్పష్టం చేశాడు. భారత జట్టు నుంచి ధోని వీడ్కోలు తీసుకున్న మరుక్షణమే శూన్యత తప్పదని అభిప్రాయపడ్డాడు.
'ధోని జట్టులో భారత్ కు సానుకూలాంశం. భారత జట్టులో మూడు నుంచి ఏడో స్థానం వరకూ బ్యాటింగ్ చేసే సామర్థ్యం ధోనిలో ఉంది. అతడి అనుభవం ద్వారా భారత జట్టు అనుకున్న దాని కంటే ఎక్కువ ప్రయోజనమే పొందుతుంది. కాకపోతే కొంతమంది ధోనిని తక్కువ చేస్తున్నారేమో అనిపిస్తోంది. అలా చేస్తే కచ్చితంగా తప్పుచేసినట్లే. గత కొంతకాలంగా ధోని ఆడుతున్నాడో నేనైతే చూడలేదు. కానీ ధోనికి బాధ్యత అప్పచెబితే మాత్రం దానికి సార్ధకత చేకూర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాడు. ప్రస్తుత విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుకు ధోని అవసరం చాలా ఉంది. జట్టు నుంచి ధోని వెళ్లిపోతే అతని స్థానాన్ని ఎవ్వరూ పూడ్చలేరు'అని గిల్లీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment