
స్టంపింగ్ చేయనందుకు భారీ జరిమానా
గాలె:ఒక వికెట్ కీపర్ స్టంపింగ్ చేయడంలో విఫలమైతే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనల్ని ఉల్లంఘించినట్లా?, కచ్చితంగా కాదు. కాకపోతే కావాలనే స్టంపింగ్ చేయకపోతే అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమే. ఇలా ప్రవర్తించిన శ్రీలంక వికెట్ కీపర్ డిక్వెల్లాకు భారీ జరిమానా పడింది. అతను మ్యాచ్ ఫీజులో 30 శాతాన్ని కోల్పోయాడు.
అసలేం జరిగిందంటే.. శుక్రవారం జింబాబ్వే-శ్రీలంకల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో లంక స్పిన్నర్ ధనంజయ బౌలింగ్ లో జింబాబ్వే ఆటగాడు సోలామాన్ క్రీజ్ బయటకి వెళ్లి షాడ్ ఆడబోయాడు. అయితే ఆ బంతిని వైడ్ గా సంధించే ప్రయత్నం చేయడంతో అప్పటికే ముందుకు వెళ్లి ఉన్న సోలామన్ రివర్స్ స్వీప్ కు యత్నించి విఫలమయ్యాడు. అప్పటికే బంతి డిక్ వెల్లా చేతుల్లో పడ్డా అతను స్పందించిన తీరు ఆశ్చర్యపరిచింది. కొన్నిసెకన్లు పాటు అలానే ఉండిపోయి బ్యాట్స్మన్ సురక్షితంగా క్రీజ్లోకి వచ్చిన తరువాత తాపీగా స్టంపింగ్ చేశాడు. ఆపై అవుట్ కు అప్లై కూడా చేశాడు. అయితే అది నాటౌట్ గా రిప్లేలో తేలింది. ఇక్కడ డిక్ వెల్లా ఉద్దేశపూర్వంగానే స్టంపింగ్ చేయలేదని నిర్ధారణకు వచ్చిన ఐసీసీ లెవల్-1 నిబంధనల ప్రకారం అతనికి 30 శాతం ఫీజు కోత విధించింది.