నరైన్‌ను కావాలనే తప్పించారా?
అనుమానం వ్యక్తం చేస్తున్న వెస్టిండీస్ దిగ్గజాలు
ముంబై: చాంపియన్స్ లీగ్ ఫైనల్‌కు ముందు వరుసగా రెండు మ్యాచ్‌లలో బౌలింగ్ యాక్షన్ సరిగా లేదంటూ కోల్‌కతాకు ఆడుతున్న సునీల్ నరైన్‌ను ఫైనల్ ఆడకుండా తప్పించారు. ఆ వెంటనే భారత్‌లో వెస్టిండీస్ పర్యటనకూ తను దూరమయ్యాడు. అయితే ఇది సహజంగా జరిగినట్లు కనిపించడం లేదని... కొన్ని శక్తులు కావాలనే నరైన్‌ను దూరం చేశాయని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజాలు క్లైవ్ లాయిడ్, వివ్ రిచర్డ్స్ అనుమానిస్తున్నారు. ‘నరైన్ చాలా సంవత్సరాల నుంచి అలాగే బౌలింగ్ చేస్తున్నాడు. అకస్మాత్తుగా ఇప్పుడు ఎందుకు చకింగ్ చేస్తున్నట్లు అనిపించింది? ప్రపంచకప్‌కు ముందు వెస్టిండీస్‌కు ప్రస్తుతం జరుగుతున్న భారత్ పర్యటన చాలా ముఖ్యమైంది.
ఇలాంటి సమయంలో ఓ క్రికెటర్‌ను తప్పిస్తే అతని ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది’ అని లాయిడ్ అన్నారు. క్రికెట్‌లోని బలమైన రాజకీయ శక్తుల వల్లే నరైన్ ఆటకు దూరమయ్యాడని రిచర్డ్స్ విమర్శించారు. ‘భారత్‌లో పర్యటన కోసమా? లేక ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకునా? అనేది నాకు తెలియదు. కానీ ఏదో ఒక బలమైన క్రికెట్ రాజకీయ శక్తి కారణంగానే నరైన్‌ను తప్పించారు’ అని రిచర్డ్స్ ఘాటుగా విమర్శించాడు. అయితే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడి చాంపియన్స్ లీగ్ ఫైనల్ తర్వాత ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘చెన్నై టైటిల్ గెలవాలనే కోల్‌కతా తరఫున నరైన్ ఫైనల్ ఆడకుండా తప్పించారు’ అని మోడి వ్యాఖ్యానించారు.