ఢిల్లీలో ఆశీష్.. గ్లాస్గోలో దీప సంచలనం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఎక్కువగా పతకాలు గెలిచే క్రీడాంశాల్లో షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ ముఖ్యమైనవి. అథ్లెటిక్స్లో ఆశించిన స్థాయిలో పతకాలు రావడం లేదు. ఇక జిమ్నాస్టిక్స్లో అయితే ఇంతకుముందు భారత క్రీడాకారులు ఫైనల్స్ దాకా పోవడమే గొప్ప. అయితే జిమ్నాస్టిక్స్లోనూ భారత్ శకం ఆరంభమైంది.
2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో భారత జిమ్నాస్ట్ ఆశీష్ కుమార్, తాజా గ్లాస్గో ఈవెంట్లో దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్ జిమ్నాస్టిక్స్లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా ఆశీష్, తొలి భారత మహిళా జిమ్నాస్ట్గా దీప రికార్డు నెలకొల్పారు. ఆశీష్ రజత, కాంస్య పతకాలు.. దీప కాంస్య పతకం గెల్చుకుని జిమ్నాస్టిక్స్ పతకాలు గెలిచే సత్తా భారత్కు ఉందని నిరూపించారు. ఇది శుభ పరిణామం.
గ్లాస్గోలో దీప మహిళల వాల్ట్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డులకెక్కింది. గురువారం జరిగిన ఫైనల్లో తొలి వాల్ట్‌లో 13,633 పాయింట్లు సాధించిన దీప... రెండో వాల్ట్‌లో అందరికంటే ఎక్కువగా 15,100 పాయింట్లు నమోదు చేసింది. అయితే ఓవరాల్ పాయింట్లలో (14,366) వెనుకబడి మూడో స్థానంతో సంతృప్తి
పడింది. అయితే పురుషుల ఫ్లోర్ ఫైనల్లో ఆశిష్ కుమార్ నిరాశపర్చాడు. 13,800 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.