
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నమెంట్‌లో భారత డబుల్స్ స్టార్ ప్లేయర్ దివిజ్ శరణ్ తన భాగస్వామి మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్)తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో దివిజ్–మార్సెలో ద్వయం 6–3, 3–6, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫిలిప్ ఓస్వాల్డ్ (ఆస్ట్రియా)–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో దివిజ్ జంట రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసినా కీలకదశలో పాయింట్లు గెలవడంలో సఫలమైంది.
తొలి సెట్‌లో ఒకసారి ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేసిన దివిజ్ జంట... రెండో సెట్‌లో తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో మాత్రం దివిజ్ ద్వయం ఒక్కసారిగా విజృంభించి 9–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి ఆ తర్వాత విజయానికి అవసరమైన ఒక పాయింట్‌ను నెగ్గి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. దివిజ్ కెరీర్‌లో ఏటీపీ టోర్నీలో ఫైనల్ చేరడం ఇది ఆరోసారి. నాలుగు డబుల్స్ టైటిల్స్ నెగ్గిన అతను, మరోసారి రన్నరప్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment