భారత్‌కు చావో...రేవో | Do-or-die situation for India in last two ODIs against Australia | Sakshi
Sakshi News home page

భారత్‌కు చావో...రేవో

Published Wed, Oct 30 2013 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

భారత్‌కు చావో...రేవో

భారత్‌కు చావో...రేవో

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు ఫేవరెట్‌గా భావించిన భారత్‌కు ఇప్పుడు చావో...రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు బౌలింగ్‌లో వైఫల్యం...

మధ్యాహ్నం గం. 1.30 నుంచి
 స్టార్ క్రికెట్‌లో ప్రత్యక్షప్రసారం
 
 నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు ఫేవరెట్‌గా భావించిన భారత్‌కు ఇప్పుడు చావో...రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు బౌలింగ్‌లో వైఫల్యం... మరోవైపు వర్షం వల్ల రెండు మ్యాచ్ (రాంచీ, కటక్)లు రద్దు కావడంతో ప్రస్తుతం ధోనిసేన పూర్తి ఒత్తిడిలో పడింది. ఈ నేపథ్యంలో వీసీఏ మైదానంలో నేడు (బుధవారం) ఆసీస్‌తో మూడో వన్డే జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో 1-2తో వెనుకబడి ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

 
  సిరీస్ చివరి దశకు రావడంతో ఆటగాళ్లందరూ స్థాయికి మించి ప్రదర్శన కనబర్చాలని భావిస్తున్నారు. సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే కచ్చితంగా ఈ చివరి రెండు మ్యాచ్‌లను ధోనిసేన విజయంతోనే ముగించాలి. లేదంటే విండీస్‌తో సిరీస్‌కు ముందు ఆటగాళ్ల ఆత్మ విశ్వాసం దెబ్బతినే అవకాశముంది. బ్యాటింగ్‌లో కోహ్లి, కెప్టెన్ ధోని విశేషంగా రాణిస్తుండటం కలిసొచ్చే అంశం.
 
 ఓపెనర్లలో ధావన్, రోహిత్‌లు రెండో వన్డేలో మాత్రమే ఆకట్టుకున్నారు. కాబట్టి ఈ ఇద్దరి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు రావాల్సి ఉంది. ఈ జోడి శుభారంభాన్నిస్తేనే జట్టు స్కోరు 300 దాటే అవకాశముంటుంది. అయితే మిడిలార్డర్‌లో రైనా, యువరాజ్ ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్నారు. జాన్సన్ పేస్‌ను, బౌన్స్‌ను వీళ్లు సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారు. అయితే జామ్తా వికెట్‌పై జాన్సన్ చెలరేగే అవకాశాలు పెద్దగా లేకున్నా.. మిగతా బౌలర్ల నుంచి ముప్పు తప్పకపోవచ్చు.
 
  షార్ట్ బంతులతో ఇప్పటికే టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను లక్ష్యంగా చేసుకున్న కంగారులు మరోసారి దానినే అస్త్రంగా ప్రయోగించనున్నారు. బౌలింగ్ విషయానికొస్తే ఇషాంత్, భువనేశ్వర్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావొచ్చు. చివరి మ్యాచ్‌లో షమీ ఆకట్టుకున్నా ఉనాద్కట్, వినయ్ కాస్త మెరుగుపడాలి. ఈ త్రయం పుంజుకుంటే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. వికెట్ మీద ఎక్స్‌ట్రా టర్న్ లభిస్తుండటం స్పిన్నర్ అశ్విన్‌కు కలిసొస్తుంది.   
 
 మరోవైపు ఆసీస్ జట్టు మంచి ఊపుమీదుంది. ఆటగాళ్లు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ విశేషంగా రాణిస్తున్నారు. ఓపెనర్లు ధాటిగా ఆడటంతో పాటు మిడిలార్డర్ భారీగా పరుగులు రాబడుతోంది. దీంతో బౌలర్ల పని సులువవుతోంది. వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తుందని ఇప్పటికే స్పిన్నర్ డోహెర్తీ భారీ ఆశలు పెట్టుకున్నాడు. సిరీస్‌లో ఆధిక్యంలో ఉండటం కూడా జట్టులో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. ఈ ఒక్క మ్యాచ్ విజయంతో సిరీస్ సొంతమవుతుంది కాబట్టి అటు కీలక ఆటగాళ్లు, ఇటు మేనేజ్‌మెంట్ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
 
 జట్లు (అంచనా):
 భారత్: ధోని (కెప్టెన్), కోహ్లి, ధావన్, రోహిత్, రైనా, యువరాజ్, జడేజా, షమీ, ఉనాద్కట్, అశ్విన్, వినయ్ / భువనేశ్వర్.
 
 ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), హ్యూస్, ఫించ్, వాట్సన్, వోజెస్, మాక్స్‌వెల్, హాడిన్, ఫాల్క్‌నర్, జాన్సన్, మెక్‌కే, డోహెర్తీ.
 
 ‘మాపై ఒత్తిడి లేదు. ఈ మ్యాచ్ చాలా కీలకం కాబట్టి ఆస్వాదించే ప్రయత్నం చేస్తాం. ఇదో మంచి సిరీస్. ప్రతి బౌలర్ మెరుగుపడేందుకు ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరికీ దృష్టిపెట్టాల్సిన అంశాలు ఉంటాయి. వాటిని నిలకడగా మెరుగుపర్చుకోవాలి. నేను కూడా వాటిపైనే దృష్టిపెట్టా. బౌలింగ్ గురించి ఆందోళన లేదు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ కొన్ని రిస్క్‌తో కూడిన షాట్లు ఆడి విజయవంతమయ్యారు.
 
 దీన్ని మేం సవాలుగా తీసుకుంటున్నాం. ఈ సిరీస్‌లో భారీ లక్ష్యాలను కూడా ఛేదించాం. నిబంధనలను పట్టించుకోవడం కంటే వాటికి సరైన మార్గం వెతకడమే ఉత్తమం. ఎలాంటి నిర్ణయాలైనా మా చేతుల్లో ఉండవు కాబట్టి మేం వాటిని అధిగమించేందుకే ప్రయత్నిస్తాం’     
 - అశ్విన్ (భారత స్పిన్నర్)
 
 ‘సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఇక్కడ మంచి క్రికెట్ ఆడాం. జట్టంతా మంచి ఆత్మ విశ్వాసంతో ఉంది. ఈ టూర్‌ను నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. బ్యాటింగ్‌లో నిలకడను కనబరుస్తున్నాం. ఇది చాలా ప్రధానం కూడా. టెస్టులతో పోలిస్తే వన్డే వికెట్లు చాలా భిన్నంగా ఉన్నాయి. నేటి మ్యాచ్‌కు తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు. కొత్త నిబంధనలు బౌలర్లకు కాస్త కష్టంగా మారాయి’
 - బెయిలీ (ఆసీస్ కెప్టెన్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement