
చెమటోడ్చిన ఇషాంత్, అశ్విన్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌లో రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దు కావడం భారత జట్టుకు కలిసివచ్చింది.
దుబాయ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌లో రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దు కావడం భారత జట్టుకు కలిసివచ్చింది. ఈ కారణంగా తాజా ఐసీసీ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సిరీస్‌ను ఆసీస్ 6-1తో గెలుచుకుంటే నంబర్‌వన్ దక్కించుకునేది. ఇప్పుడు మిగిలిన రెండు వన్డేలు నెగ్గినా వారి ప్రయత్నం నెరవేరదు. అయితే వారి పాయింట్లు మాత్రం 119కి చేరుతాయి. భారత్ 120 పాయింట్లతో ఉంటుంది. ఒకవేళ భారత్ ఆ రెండు మ్యాచ్‌లు నెగ్గితే 123 పాయింట్లు సాధిస్తుంది. ఆసీస్ 114 పాయింట్లకు పడిపోతుంది.
నాగ్‌పూర్: పేలవ ఫామ్‌తో ఇబ్బందులెదుర్కొంటున్న పేసర్ ఇషాంత్ శర్మ, స్పిన్నర్ ఆర్.అశ్విన్ నెట్స్‌లో సోమవారం ఇక్కడి వీసీఏ స్టేడియంలో తీవ్రంగా సాధన చేశారు. బుధవారం ఆసీస్‌తో భారత జట్టు కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌ను నిలువరించాలంటే భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లను కచ్చితంగా నెగ్గాల్సి ఉంది. ఇప్పటిదాకా ఆడిన నాలుగు వన్డేల్లో ఇషాంత్ మూడు వికెట్లు మాత్రమే పడగొట్టి ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. డెత్ ఓవర్లో తన ప్రదర్శన జట్టుకు భారంగా మారుతోంది. మూడో వన్డేలో 48వ ఓవర్ వేసిన ఇషాంత్ ఏకంగా 30 పరుగులిచ్చి జట్టును ఓటమిపాలు చేశాడు. దీంతో రాంచీ వన్డేలో జట్టులో లేకుండాపోయాడు. ఇక ఐదో వన్డే రద్దు కావడంతో పాటు నాగ్‌పూర్ వన్డేలోనూ బ్యాటింగ్ పిచ్ సిద్ధమవుతుండడంతో భారత జట్టు బౌలర్లపై మరింత ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇషాంత్, అశ్విన్ ముమ్మర ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.
సిరీస్ ముందే గెలుస్తాం: డోహర్తి
నాగ్‌పూర్: ఆరో వన్డే విజయంతోనే భారత్‌పై సిరీస్ విజయం సాధిస్తామని ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ జేవియర్ డోహర్తి ధీమా వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్ కోసం చివరి వన్డే దాకా ఎదురుచూడబోమన్నాడు. వర్షంతో రెండు మ్యాచ్‌లు రద్దవడంతో 7 వన్డేల టోర్నీ కాస్త ఇప్పుడు ఐదు వన్డేల సిరీస్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో ఆధిక్యంలో ఉన్న ఆసీస్ ఇక్కడ బుధవారం జరిగే వన్డేలో గెలవాలనే పట్టుదలతో ఉంది. సోమవారం ప్రాక్టీస్ సెషన్ ముగిశాక డోహర్తి మాట్లాడుతూ ‘ఈ మ్యాచ్ గెలిచేందుకే ఇక్కడికొచ్చాం. బెంగళూరు (చివరి మ్యాచ్ వేదిక) వన్డే దాకా భారత్‌కు అవకాశమివ్వం. ఆరో వన్డే మాకంటే ధోని సేనకే కీలకం. చావోరేవో వారికే కాబట్టి... ఒత్తిడంతా భారత్‌పైనే ఉంది’ అని అన్నాడు.