సాక్షి, హైదరాబాద్ : ‘మన్కడింగ్ ఔట్’ గత అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు. క్రికెట్ అభిమానుల మధ్య చర్చకు వస్తున్న పదం. రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్ బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయడానికి ఈ తరహా టెక్నిక్ ఉపయోగించడంతో ఈ పదం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ టెక్నిక్‌తో రాజస్తాన్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్‌ను అశ్విన్ పెవిలియన్‌కు చేర్చాడు. నిబంధనలు అది ఔటేనని చెబుతున్నా.. అభిమానులు, మాజీ క్రికెటర్లు మాత్రం తొండాటని అశ్విన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
మన్కడింగ్ ఔట్ ... క్రికెట్‌లోని వివాదాస్పద నిబంధనల్లో ఒకటి. క్రికెట్ నియమావళి 41.16 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. అయితే దీన్ని1947–48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్ వినూ మన్కడ్ చేయడంతో ఆయన పేరుమీదుగా మన్కడింగ్ నిబంధనగా క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) నియమావళిలో చేర్చింది. ఆ పర్యటనలో వినూ మన్కడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజు వదిలి పరుగుకు ప్రయత్నించాడు. దీంతో పలుమార్లు మన్కడ్ అతన్ని వారించినా వినిపించుకోలేదు. దీంతో బ్రౌన్ క్రీజు దాటిన తర్వాత మన్కడ్ అతన్ని రనౌట్ చేయడంతో అతనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ పర్యటనలో మరోసారి కూడా మన్కడ్ ..బ్రౌన్‌ను ఔట్ చేశాడు. అప్పటినుంచి ఈ రనౌట్‌ను మన్కడింగ్ ఔట్‌గా పిలుస్తున్నారు.
బౌలర్లకు అనుకూలంగా మార్పు..
అయితే తొలుత నిబంధన 42.15 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు మాత్రమే అతడిని అవుట్ చేసే అవకాశం కలిగేది. కానీ ఎంసీసీ బౌలర్లకు అనుకూలంగా ఈ నిబంధనను 41.16 గా మార్చేసింది. గతంలో బౌలర్ యాక్షన్‌కు ముందు మాత్రమే ఔట్ చేసే అవకాశముండేది. కానీ సవరించిన నిబంధనలో యాక్షన్ (బంతి విడుదలకు ముందు చేయి పూర్తిగా తిరిగినా) తర్వాత కూడా ఔట్ చేసే వెసులుబాటు కల్పించారు. అయితే ఇది క్రీడాస్పూర్తి విరుద్దమని, ఈ నిబంధనను తొలిగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
గవాస్కర్ గరం..
ఈ మన్కడింగ్ పదాన్నే పూర్తిగా తొలిగించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏంసీసీకి సూచించారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమైన రనౌట్‌గా పరిగణించే ఈ ప్రక్రియకు భారత క్రికెట్ దిగ్గజం పేరును కొనసాగించడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతగా అవసరమైతే తొలిసారిగా ఇలా ఔటైన బిల్ బౌన్ పేరు మీదుగా బౌన్డ్ అని పిలువాలంటూ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment