నా నుదిటిపై ఏమైనా రాసి ఉందా!
* ప్రతీసారి గెలిపించడం సాధ్యం కాదు
* ఫినిషింగ్‌పై ధోని వ్యాఖ్య
సిడ్నీ: ధోని అంటే బెస్ట్ ఫినిషర్... చివర్లో ఎన్ని పరుగులు చేయాల్సి ఉన్నా, ఎంత రన్‌రేట్ అవసరమైనా అతను క్రీజ్‌లో ఉంటే చాలు గెలిపిస్తాడనే ధీమా అందరిది. కానీ ఇటీవలి కాలంలో అతను ఇలా ముగిస్తున్న మ్యాచ్‌లు పెద్దగా ఉండటం లేదు. నాలుగో వన్డేలో ఘోరంగా విఫలమైన అతను... సిడ్నీలో మ్యాచ్ ముగించకపోయినా, ఆఖరి ఓవర్లో భారీ సిక్సర్‌తో పని సులువు చేశాడు. అయితే ఇదేమీ అంత తేలికైన విషయం కాదని, ప్రతీసారి అంచనాలు అందుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశాడు.
‘లోయర్ ఆర్డర్‌లో మ్యాచ్‌లు ముగించడం నా బాధ్యత కావచ్చు. దానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. అందరి లక్ష్యం గెలిపించడమే. కానీ ఆ స్థితిలో ఆడటం అంత సులువు కాదు. హిట్టింగ్‌కు ప్రయత్నించి సిక్సర్ పడితే వహ్వా అంటారు, అదే అవుటైతే ఆ షాట్ ఆడటం అవసరమా అంటారు. ధోని అక్కడున్నాడా... అయితే మ్యాచ్ గెలిచేశాం అనుకోవడం తప్పు. నేనే మ్యాచ్ ముగించాలని ఏమైనా నా నుదుటి మీద రాసి ఉందా. మంచి యార్కర్ పడితే సిక్స్ ఎలా కొడతాం. నేను హెలికాప్టర్ షాట్ కొట్టలేదని అడుగుతారు. అది బౌన్సర్ అయితే నేనెలా ఆడేది? పరిస్థితులను బట్టి ఆడతామే కానీ ఎప్పుడూ గెలిపించడం సాధ్యం కాదు’ అని ధోని కుండబద్దలు కొట్టాడు.