
‘డబుల్’ ట్రబుల్
సింగిల్స్‌తో పోలిస్తే డబుల్స్ మ్యాచ్‌ల్లో అత్యద్భుతంగా ఆడే భారత ఆటగాళ్లు ఈసారి మాత్రం నిరాశపరిచారు
♦ పేస్ జోడి ఓటమితో సన్నగిల్లిన ఆశలు
♦ 1-2తో భారత్ వెనుకంజ
♦ చెక్‌తో డేవిస్ కప్ ప్లే ఆఫ్ మ్యాచ్
న్యూఢిల్లీ : సింగిల్స్‌తో పోలిస్తే డబుల్స్ మ్యాచ్‌ల్లో అత్యద్భుతంగా ఆడే భారత ఆటగాళ్లు ఈసారి మాత్రం నిరాశపరిచారు. చెక్ రిపబ్లిక్‌తో జరుగుతున్న వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో డబుల్స్‌లో భారత జోడి లియాండర్ పేస్ - రోహన్ బోపన్న అనూహ్యంగా షాక్ తిన్నారు. దీంతో భారత్ 1-2తో వెనకబడింది. చివరి రోజు (నేడు) జరిగే రెండు రివర్స్ సింగిల్స్‌లోనూ భారత్ గెలిస్తేనే ముందుకు వెళుతుంది. ఆటగాళ్ల బలాబలాలను బట్టి చూస్తే భారత్ ముందుకెళితే అద్భుతమే అనుకోవాలి.
శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో పేస్-బోపన్న 5-7, 2-6, 2-6తో రాడెక్ స్టెపానెక్-ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. రెండు గంటలా 10 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... బోపన్న అన్ని రంగాల్లో విఫలంకావడం భారత్‌ను దెబ్బతీసింది. సర్వీస్‌తో పాటు షాట్లపై పట్టు కోల్పోయిన అతను బంతిని ప్రత్యర్థి కోర్టులోకి పంపడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. బోపన్న కొట్టిన చాలా హాఫ్ వ్యాలీలు లైన్ బయటకు వెళ్లాయి. అయితే మూడో సెట్‌లో కాస్త సర్వీస్ మెరుగుపడ్డా భారత్ పుంజుకోలేకపోయింది. మరోవైపు షాట్లలో నిలకడను చూపెట్టిన పేస్ కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు.
► గత 15 ఏళ్లలో డేవిస్ కప్‌లో పేస్‌కు ఇది రెండో ఓటమి. ఇంతకుముందు 2012లో బోపన్నతో కలిసి ఉజ్బెకిస్తాన్ చేతిలో ఓడిపోయాడు. 2000 తర్వాత స్వదేశంలో పేస్ ఓడిపోవడం ఇదే తొలిసారి.
► మ్యాచ్ మొత్తంలో పేస్ నాలుగుసార్లు, బోపన్న మూడుసార్లు సర్వీస్‌ను కోల్పోయారు. ప్రతిసెట్ ఆరంభంలో భారత్ సర్వీస్ కోల్పోవడం చెక్‌కు కలిసొచ్చింది. స్టెపానెక్ రెండుసార్లు సర్వీస్‌ను చేజార్చుకుంటే ఆడమ్ మాత్రం సూపర్ సర్వీస్‌తో పాటు బలమైన రిటర్న్ షాట్స్‌తో భారత్‌ను కట్టిపడేశాడు.
► తొలిసెట్ ఐదో గేమ్‌లో బోపన్న సర్వీస్ కోల్పోయాడు. అతను కొట్టిన బ్యాక్‌హ్యాండ్ షాట్ బేస్‌లైన్ దాటి బయటకు వెళ్లడంతో భారత్ వెనుకబడింది. తర్వాత డబుల్ ఫాల్ట్ చేయడంతో చెక్ పుంజుకుంది. తర్వాత పావ్లాసెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసి భారత్ పుంజుకున్నా.. తర్వాతి గేమ్‌లో పేస్ సర్వీస్‌ను చేజార్చుకున్నాడు. ఈ దశలో బోపన్నతో జరిగిన సుదీర్ఘ ర్యాలీని పావ్లాసెక్ అద్భుతమైన వ్యాలీతో ముగించాడు. 12వ గేమ్‌లో రాడెక్ సర్వీస్ నిలబెట్టుకోవడంతో సెట్ చెక్ సొంతమైంది.
► రెండోసెట్‌లో పేస్ వరుసగా రెండు గేమ్‌ల్లో సర్వీస్ కోల్పోయాడు. తర్వాత రాడెక్, పావ్లాసెక్‌లు సర్వీస్‌లు కాపాడుకున్నారు. ఐదో గేమ్‌లో బోపన్న సర్వీస్‌లో పావ్లాసెట్ కొట్టిన క్రాస్ కోర్టు విన్నర్‌కు చెక్‌కు రెండు బ్రేక్ పాయింట్లు వచ్చాయి. ఆరో గేమ్‌లో పావ్లాసెక్ సర్వీస్ కోల్పోవడంతో భారత్ స్కోరు 2-4కు చేరింది. కానీ ఏడో గేమ్‌లో పేస్ మళ్లీ సర్వీస్ చేజార్చుకున్నాడు. 8వ గేమ్‌లో స్టెపానెక్ సర్వీస్‌ను కాపాడుకోవడంతో చెక్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.
► మూడో సెట్‌లో పేస్-బోపన్న సర్వీస్‌లు కాపాడుకోవడంతో 2-1 ఆధిక్యంలోకి వెళ్లారు. కానీ పేస్ చేసిన రెండు అనవసర తప్పిదాలతో భారత్ మళ్లీ వెనుకబడిపోయింది. దీన్ని ఆసరాగా చేసుకున్న చెక్ జోడి చెలరేగిపోయింది. స్కోరు 5-1 ఉన్న దశలో పేస్ సర్వీస్ కాపాడుకోవడంతో చెక్ ఆధిక్యం 5-2కు తగ్గింది. కానీ ఆ వెంటనే స్టెపానెక్ సర్వీస్‌ను కాపాడుకుని సెట్‌ను, మ్యాచ్‌ను నెగ్గారు.