
ద్రవిడ్ శిక్షణకు పరీక్ష!
భారత సీనియర్ జట్టులో స్థానమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వర్ధమాన క్రికెటర్లకు మరో అవకాశం! గతంలో టెస్టులు ఆడిన సీనియర్లు, తొలి అవకాశం కోసం ఎదురు చూస్తున్న కుర్రాళ్లూ వీరిలో ఉన్నారు...
- కోచ్‌గా తొలి మ్యాచ్
- నేటినుంచి భారత్ ‘ఎ’, ఆసీస్ ‘ఎ’ అనధికారిక టెస్టు
చెన్నై: భారత సీనియర్ జట్టులో స్థానమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న వర్ధమాన క్రికెటర్లకు మరో అవకాశం! గతంలో టెస్టులు ఆడిన సీనియర్లు, తొలి అవకాశం కోసం ఎదురు చూస్తున్న కుర్రాళ్లూ వీరిలో ఉన్నారు. నేటినుంచి భారత్ ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’ మధ్య జరిగే తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ కోసం వీరంతా సిద్ధమయ్యారు. గతంలో ఐపీఎల్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించినా...దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తొలిసారి పూర్తి స్థాయిలో కోచ్ బాధ్యతలు తీసుకోవడంతో ఈ సిరీస్ ఆసక్తి రేపుతోంది. ‘ఎ’ టీమ్ ద్వారా భవిష్యత్తులో సీనియర్ జట్టుకు తగినంత మంది రిజర్వ్ ఆటగాళ్లను అందించాలన్నదే తన లక్ష్యమని ద్రవిడ్ గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో యువ జట్టు ప్రదర్శనపై అందరి దృష్టీ నిలిచింది. చతేశ్వర్ పుజారా నేతృత్వంలో భారత్ బరిలోకి దిగుతుండగా, ఆసీస్ టీమ్‌కు ఉస్మాన్ ఖాజా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఆరోన్ అవుట్
మ్యాచ్‌కు ముందే భారత్‌కు పేస్ విభాగంలో ఎదురు దెబ్బ తగిలింది. సీనియర్ టెస్టు జట్టులో సభ్యుడైన వరుణ్ ఆరోన్ వైరల్ ఫీవర్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. టెస్టు స్పెషలిస్ట్ అయినా ఇటీవల బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయిన పుజారా ఈ సిరీస్‌లో రాణించి తిరిగి రావాలని పట్టుదలగా ఉన్నాడు. అతని భవిష్యత్తుకు ఈ సిరీస్ కీలకం కానుంది. పుజారాతో పాటు కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. భారత సెలక్టర్ల విశ్వాసం కోల్పోయిన ప్రజ్ఞాన్ ఓజా, అమిత్ మిశ్రా, ముకుంద్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఐపీఎల్‌తో కాస్త పేరు తెచ్చుకున్న కుర్రాళ్లు అపరాజిత్, కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, శ్రేయస్ గోపాల్ నాలుగు రోజుల ఫార్మాట్‌లోనూ రాణించాల్సి ఉంది.
పటిష్టంగా ప్రత్యర్థి
మరో వైపు ఆస్ట్రేలియా జట్టులోనూ చాలా మంది టెస్టులు ఆడిన సీనియర్లు ఉన్నారు. భారత పిచ్‌లపై ఆడకపోవడం బలహీనతగా కనిపిస్తున్నా... వీరంతా ఏదో ఒక దశలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నవారే. కెప్టెన్ ఖాజాతో పాటు గత సిరీస్‌లో భారత్‌తో టెస్టు ఆడిన జో బర్న్స్, ఫెర్గూసన్, వేడ్, అగర్ అనుభవజ్ఞులు కాగా... కౌల్టర్ నీల్, సీన్ అబాట్, ప్యాటిన్సన్, గురీందర్ సంధు ఐపీఎల్‌తో అందరికీ చిరపరిచితమైన ఆటగాళ్లే. ఈ నేపథ్యంలో తొలి టెస్టు ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది.