ఉద్యోగిని... క్రీడల్లో పతకాల గని | Employee Champion in Shot Put Throw | Sakshi
Sakshi News home page

ఉద్యోగిని... క్రీడల్లో పతకాల గని

Published Wed, Jan 23 2019 8:07 AM | Last Updated on Wed, Jan 23 2019 8:07 AM

Employee Champion in Shot Put Throw - Sakshi

జావలిన్‌ త్రోలో ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన క్రీడాకారిణులతో ప్రథమ బహుమతి గ్రహీత మాధవి

తూర్పుగోదావరి , అన్నవరం (ప్రత్తిపాడు): ఏ ఆటల పోటీల్లో పాల్గొన్నా పతకాలు సాధించకుండా వెనుతిరగని అన్నవరం దేవస్థానం ఉద్యోగిని వల్లూరి మాధవి కర్నూలులో జరిగిన 38వ రాష్ట్రస్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్‌ పోటీల్లో కూడా మూడు స్వర్ణ పతకాలు సాధించి తన సత్తా చాటారు. వచ్చే నెల ఐదో తేదీ నుంచి పదో తేదీ వరకూ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే జాతీయస్థాయి మాస్టర్స్‌ అధ్లెటిక్‌ పోటీలకు ఈమె ఎంపికయ్యారు. విద్యార్థి దశలోనే కాదు, ఉద్యోగం చేస్తూ కూడా తన ప్రతిభను చాటుతున్నారు అన్నవరం దేవస్థానం వైద్యశాల ఫార్మసీ సూపర్‌వైజర్‌ వల్లూరి మాధవి. గతంలో జిల్లా స్థాయి నుంచి జాతీయస్థాయి వరకూ ఎన్నో ఆటల పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన ఆమె ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ కర్నూలులో జరిగిన 38వ రాష్ట్రస్థాయి మాస్టర్స్‌ అ«థ్లెటిక్స్‌ పోటీల్లో డిస్క్‌స్‌ త్రో, షాట్‌ఫుట్, జావిలిన్‌ త్రోలో  ప్రథమస్థానం పొంది స్వర్ణ పతకాలు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

గతంలోనూ పతకాల పంట...
గత డిసెంబర్‌ ఎనిమిదో తేదీన రాజమహేంద్రవరంలో జరిగిన జిల్లా స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని షార్ట్‌పుట్, జావలిన్‌త్రో, డిస్క్‌స్‌త్రోలో ప్రథమస్థానం పొంది, కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
కర్నూలులో ఈ నెల 15–17 తేదీల మధ్య జరిగిన పోటీలో షాట్‌ఫుట్‌లో 7.17 మీటర్లు, డిస్క్‌స్‌త్రోలో 16.91 మీటర్లు,  జావలిన్‌త్రోలో 16.51 మీటర్లు విసిరి ప్రథమస్థానంలో నిలిచి స్వర్ణ పతకాలు సాధించారు.
2018 జనవరిలో ఏడు, ఎనిమిది, తొమ్మిది తేదీల్లో గుంటూరులో జరిగిన 36వ ఏపీ మాస్టర్స్‌ అథ్లెటిక్‌ మీట్‌లో మూడు పతకాలు సాధించారు. షార్ట్‌ఫుట్, జావలిన్‌త్రో క్రీడాంశాలలో స్వర్ణ, డిస్క్‌త్రోలో రజత పతకాలు సాధించారు.
2015లో కడప జిల్లా పొద్దుటూరులో జరిగిన 35వ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించారు. అనంతరం ఒంగోలులో జరిగిన ఎన్‌జీఓ ఆటల పోటీల్లో కూడా నాలుగు పతకాలు సాధించారు.
విద్యార్ధి దశలో సుమారు 30 సార్లు రాష్ట్ర, జాతీయ స్ధాయి ఆటల పోటీల్లో పాల్గొని పతకాలు సాధించానని తెలిపారు. ఫార్మసీ విద్యార్థినిగా వాలీబాల్‌ జాతీయ పోటీల్లో వరుసగా మూడేళ్లు ఆడానని తెలిపారు. 1991లో బరంపురం, 1992లో భోపాల్, 1993లో బీహార్‌లోని పాట్నాలో ఆడానని తెలిపారు.
2017 మార్చిలో మైసూర్‌లో జరిగిన జాతీయస్ధాయి ఎన్‌జీఓ ఆటల పోటీలో కూడా పాల్గొన్నానని, ఇంతవరకూ వివిధ పోటీల్లో 60కిపైగా పతకాలు సాధించానని వివరించారు. దేవస్థానం ఛైర్మన్‌ ఐవీ రోహిత్, ఈఓ ఎంవీ త్రినాధరావు, ఇతర దేవస్థానం సిబ్బంది ప్రోత్సాహంతో ఈ విజయాలు సాధించగలుగుతున్నానని వివరించారు. 38వ రాష్ట్రస్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో విజేతగా నిలిచి మూడు పతకాలు సాధించిన మా«ధవిని పలువురు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement