
చెన్నైలోనే చివరి టెస్టు..
చెన్నై: మరో నాలుగు రోజుల్లో చెన్నైలోని చిదంబర్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్టు వేదికను మరో చోటకి తరలించే ఆలోచనకు దాదాపు ముగింపు పలికినట్లే కనబడుతోంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపథ్యంలో మ్యాచ్ వేదికను మార్చాలని తొలుత భావించారు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు బాగానే ఉండటంతో వేదిక మార్పును పక్కకు పెట్టాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) భావిస్తోంది.
దీనిలో భాగంగానే తమిళనాడు స్పోర్ట్స్ అథారిటి నుంచి కూడా క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా తాజా ప్రకటన కూడా అందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఆ మ్యాచ్ చెన్నైలోనే జరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతానికి అదే వేదికపై మ్యాచ్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు శుక్లా పేర్కొన్నారు.