నాలుగేళ్ల క్రితం భారత జట్టు సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్ తొలి టెస్టులో అనూహ్యంగా ఓడింది. అయితే వెంటనే కోలుకొని తర్వాతి టెస్టును, ఆపై సిరీస్‌ను కూడా గెలుచుకుంది. ఇప్పుడు కూడా టీమిండియా సరిగ్గా అలాంటి స్థితిలోనే నిలిచింది. ఇంకా చెప్పాలంటే గత 22 ఏళ్లలో స్వదేశంలో భారత్ ఎప్పుడూ వరుసగా రెండు టెస్టులు ఓడలేదు. తొలి టెస్టు పరాభవాన్ని వెనక్కి తోసి కోహ్లి సేన మరింత పట్టుదలతో చెలరేగితే ఈ మ్యాచ్‌లో తుది ఫలితం మారవచ్చు.
మరోవైపు ఇంగ్లండ్ కూడా తమకు దక్కిన ఆధిక్యాన్ని చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది. వేదిక అదే అయినా మరో పిచ్‌పై మ్యాచ్ జరుగుతుండటం, దానిపై తొలి రోజు నుంచే బంతి గింగిరాలు తిరుగుతుందని వినిపిస్తున్న నేపథ్యంలో ఏ జట్టు స్పిన్నర్లు ఎలా వాడుకుంటారనేది ఆసక్తికరం. అయితే మన జట్టుకు అనుకూలంగా తయారు చేయిస్తున్న స్పిన్ పిచ్ 2017 తరహాలో మనకే వ్యతిరేకంగా ‘బూమరాంగ్’ కాకుంటే మంచిది!
చెన్నై: ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పరాజయాన్ని మరచి కోహ్లి సేన మరో సమరానికి సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇక్కడి ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో శనివారం నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే సిరీస్‌లో కనీసం రెండు టెస్టులు గెలవాల్సిన భారత్ దానిని ఇక్కడే మొదలు పెట్టాల్సి ఉంది. మరోవైపు ఈ టెస్టునూ నెగ్గితే సిరీస్ చేజార్చుకునే ప్రమాదం నుంచి రూట్ సేన సురక్షితంగా బయపడుతుంది. అయితే తొలి మ్యాచ్ జోరును ఇంగ్లండ్ ఇక్కడా కొనసాగించగలదా అనేది చూడాలి. కరోనా కాలం తర్వాత ప్రేక్షకులను అనుమతిస్తున్న తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో అభిమానులు మైదానంలోకి అడుగు పెట్టనున్నారు.
అక్షర్ పటేల్‌కు చోటు...
అశ్విన్ మినహా మిగిలిన ఇద్దరు స్పిన్నర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం కూడా తొలి టెస్టులో భారత జట్టు పరాజయానికి కారణాల్లో ఒకటి. ఆ మ్యాచ్‌కు అనూహ్యంగా గాయపడి ఆటకు దూరమైన లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకొని ఈ మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు. అతను టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయమైంది. షాబాజ్ నదీమ్ స్థానంలో అక్షర్ ఆడతాడు. అయితే కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటుపైనే ఉత్కంఠ నెలకొంది.
గత మ్యాచ్‌లాగే బ్యాటింగ్ అవసరమని భావిస్తే వాషింగ్టన్ సుందర్ తన స్థానం నిలబెట్టుకుంటాడు. మిగిలిన జట్టులో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగనుంది. కొన్నాళ్ల క్రితం దక్షిణాఫ్రికాపై తొలిసారి ఓపెనర్‌గా ఆడినప్పుడు చెలరేగిన రోహిత్ శర్మ మరోసారి భారీగా పరుగులు సాధించాలని జట్టు కోరుకుంటోంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూకుడైన బ్యాటింగ్ జట్టుకు అదనపు బలం. సొంత మైదానంలో సత్తా చాటిన అశ్విన్ దానిని పునరావృతం చేయాలని కోరుకుంటున్నాడు. సీనియర్ పేసర్లు ఇషాంత్, బుమ్రా అందుబాటులో ఉండటంతో మరోసారి హైదరాబాద్ బౌలర్ సిరాజ్ పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. దాదాపు అదే జట్టు ఆడుతోంది కాబట్టి తొలి టెస్టు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటే టీమిండియా మరోసారి తన స్థాయిని ప్రదర్శించగలదు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), గిల్, రోహిత్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, అక్షర్, ఇషాంత్, బుమ్రా, సుందర్/ కుల్దీప్.
ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), సిబ్లీ, బర్న్స్, లారెన్స్, స్టోక్స్, పోప్, ఫోక్స్, అలీ, బ్రాడ్, లీచ్, వోక్స్/స్టోన్.
పిచ్, వాతావరణం
తొలి టెస్టుతో పోలిస్తే భిన్నమైన పిచ్. మొదటి రోజు నుంచే స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. అయితే ఐదు రోజులు ఇలాంటి పిచ్ మనగలదా అనేది ఆసక్తికరం. ఈ నేపథ్యంలో టాస్ మరోసారి కీలకం కానుంది. మ్యాచ్‌కు వర్షం నుంచి ముప్పు లేదు.
నాలుగు మార్పులతో...
ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు తమ 12 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మొదటి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయంలో సీనియర్ పేసర్ అండర్సన్ రెండో ఇన్నింగ్స్‌లో వేసిన అద్భుత స్పెల్ పాత్ర ఎంతో ఉంది. ఆ ప్రదర్శన అనంతరం రెండో టెస్టులో కూడా తాను ఆడాలని ఉత్సాహంగా ఉన్నట్లు అండర్సన్ చెప్పాడు. అయితే ఇంగ్లండ్ బోర్డు మాత్రం తమ ‘రొటేషన్ పాలసీ’ని ఏమాత్రం మార్చేది లేదని కచ్చితంగా చెప్పేసింది. అతని స్థానంలో మరో సీనియర్ స్టువర్ట్ బ్రాడ్ జట్టులోకి వస్తాడు. గాయపడ్డ ఆర్చర్ స్థానంలో అదే స్థాయి వేగంతో బౌలింగ్ చేసే ఒలీ స్టోన్ లేదా ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్‌లలో ఒకరు జట్టులోకి వస్తారు. బట్లర్ తిరిగి స్వదేశం వెళ్లడంతో ఫోక్స్ వికెట్ కీపర్‌గా జట్టులోకి రాగా... బెస్ స్థానంలో మొయిన్ అలీకి అవకాశం లభించింది. అయితే ఈసారి కూడా ఇంగ్లండ్ అవకాశాలు రూట్ బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment