ఫాల్క్‌నర్ మెరుపులు
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 301.... అప్పటికి స్కోరు 44 ఓవర్లలో 244/9. గెలవాలంటే 36 బంతుల్లో 57 పరుగులు చేయాలి. ఆల్‌రౌండర్ ఫాల్క్‌నర్ 14 పరుగులతో ఆడుతున్నాడు. చివరి ఆటగాడు మెక్‌కే క్రీజులోకి వచ్చాడు. ఇక ఇంగ్లండ్ విజయం లాంఛనమే అనుకున్నారు. ఈ దశలో ఫాల్క్‌నర్ (47 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు; 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గతేడాది భారత్‌తో మొహాలీలో ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ... ఒంటిచేత్తో ఆసీస్‌ను గెలిపించాడు.
చివరి వికెట్‌కు అజేయంగా 57 పరుగులు వస్తే... ఇందులో మెక్‌కే చేసింది కేవలం 2 మాత్రమే. మిగిలిన 55 ఫాల్క్‌నర్ చేయడం విశేషం. చివరి ఓవర్లో విజయానికి 12 పరుగులు అవసరం కాగా... తొలి మూడు బంతుల్లో మూడు ఫోర్లతో మ్యాచ్‌ను ముగించాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఫాల్క్‌నర్ ఊచకోత కోయడంతో... శుక్రవారం గబ్బాలో జరిగిన రెండో వన్డేలో ఆసీస్ ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లంగ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు సాధించింది. మెర్గాన్ (99 బంతుల్లో 106; 4 ఫోర్లు; 6 సిక్స్) సెంచరీ చేయగా, బెల్ (84 బంతుల్లో 68; 5 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. కౌల్టర్ నైల్, ఫాల్క్‌నర్, మ్యాక్స్‌వెల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 301 పరుగులు చేసి గెలిచింది. షాన్ మార్ష్ (69 బంతుల్లో 55; 7 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (39 బంతుల్లో 54; 8 ఫోర్లు) రాణించారు. జోర్డాన్, బ్రెస్నన్, రూట్‌లకు రెండు వికెట్లు దక్కాయి.