
ఇంగ్లండ్ ఘన విజయం
తొలి వన్డేలో 210 పరుగులతో ఓడిన న్యూజిలాండ్
బర్మింగ్‌హామ్ : వన్డే ప్రపంచకప్ ఫైనలిస్ట్ న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ జట్టు కళ్లుతిరిగే షాక్ ఇచ్చింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ ఏకంగా 210 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. ఆ దేశ క్రికెట్ చరిత్రలో వన్డేల్లో అతి పెద్ద విజయం ఇది. 1975లో భారత్‌పై 202 పరుగులతో గెలిచిన రికార్డును ఇప్పుడు ఇంగ్లండ్ సవరించింది.
రూట్ (104), బట్లర్ (129)ల సెంచరీల సాయంతో ఇంగ్లండ్ తొలుత 50 ఓవరల్లో 9 వికెట్లకు 408 పరుగుల భారీ స్కోరు చేయగా... న్యూజిలాండ్ 31.1 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. టేలర్ (57) మినహా అందరూ విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్, రషీద్ నాలుగేసి వికెట్లు తీసుకున్నారు. రెండు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం జరుగుతుంది.