నవ్విపోదురుగాక... | England Thrash India By An Innings and 54 Runs | Sakshi
Sakshi News home page

నవ్విపోదురుగాక...

Published Sun, Aug 10 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

నవ్విపోదురుగాక...

నవ్విపోదురుగాక...

అదేంటోగానీ... అశ్విన్, జడేజాలకు తిరగని బంతి మొయిన్ అలీ చేతిలో గిర్రున తిరిగింది..! ఏం విడ్డూరమోగానీ.... భారత బ్యాట్స్‌మెన్ ఎలా ఆడినా బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకే వెళ్లింది..! అదేం వైపరీత్యమోగానీ... మనకు కలిసొస్తుందనుకున్న ప్రతి అంశం ప్రత్యర్థులకు వరంగా మారింది...! బ్యాటింగ్ వికెట్... టాస్ గెలిచాం... జట్టులో టాప్ బ్యాట్స్‌మెన్... బంతిని స్వింగ్ చేసే బౌలర్లు... నాణ్యమైన స్పిన్నర్లు... నాలుగో టెస్టులో ఇవేవీ భారత్ ఓటమిని అడ్డుకోలేకపోయాయి. రెండో రోజు గనక వర్షం లేకపోతే ఈ మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసినట్లే..! ఇంతకంటే ఓ జట్టుకు అవమానం ఏముంటుంది? ఒక్క సెషన్‌లో 9 వికెట్లు... 13 పరుగుల వ్యవధిలో 5 ‘టాప్’ వికెట్లు... పసికూనలు కూడా ఇంత దరిద్రంగా ఆడరు. తొలి ఇన్నింగ్స్‌లో సున్నాల రికార్డును మరచిపోయేలా... లార్డ్స్ విజయాన్ని మూడు రోజుల మురిపెంగా మార్చి... మాంచెస్టర్‌లోనూ ఓటమిని మూట గట్టుకుంది. ఇక ఆఖరి టెస్టులో ఏం చేస్తారో మరి..!
 
నాలుగో టెస్టులో భారత్ ఘోర పరాజయం
ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు
సిరీస్‌లో 2-1 ఆధిక్యం
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బ్రాడ్
చివరి టెస్టు 15 నుంచి
మాంచెస్టర్: ఇదేం ఆట...! నాలుగో టెస్టులో భారత ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తే స్కూల్ పిల్లలు వీళ్ల కంటే నయమనిపిస్తోంది. పేరుకు ప్రపంచ స్థాయి క్రికెటర్లు... ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సమర్థులు... కానీ గల్లీ ఆటగాళ్ల మాదిరిగా కూడా ఆడలేకపోయారు. పరుగులు చేయలేకపోయినా... కనీసం వికెట్లు కాపాడుకోవాలన్న కనీస బాధ్యతను మరిచారు. పరాయి గడ్డపై పరువు పోతుందన్న ధ్యాస లేకుండా ఒకరి తర్వాత ఒకరు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఫలితంగా మూడు రోజుల్లోనే ముగిసిన నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో కుక్‌సేన 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
 
ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శనివారం మూడో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 105.3 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టుకు 215 పరుగుల ఆధిక్యం లభించింది. రూట్ (77), బట్లర్ (70)లు రాణించారు. భువనేశ్వర్, ఆరోన్ చెరో మూడు, పంకజ్ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 43 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ (46 నాటౌట్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అలీ 4, అండర్సన్, జోర్డాన్ చెరో రెండు వికెట్లు తీశారు. బ్రాడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు ఈనెల 15న ఓవల్‌లో ప్రారంభమవుతుంది.
 
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 152 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) పంకజ్ (బి) ఆరోన్ 17; రాబ్సన్ (బి) భువనేశ్వర్ 6; బ్యాలెన్స్ ఎల్బీడబ్ల్యు (బి) ఆరోన్ 37; బెల్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 58; జోర్డాన్ (సి) ఆరోన్ (బి) భువనేశ్వర్ 13; రూట్ (సి) ధోని (బి) పంకజ్ 77; అలీ (బి) ఆరోన్ 13; బట్లర్ (సి) పుజారా (బి) పంకజ్ 70; వోక్స్ నాటౌట్ 26; బ్రాడ్ రిటైర్డ్‌హర్ట్ 12; అండర్సన్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 9; ఎక్స్‌ట్రాలు: 29; మొత్తం: (105.3 ఓవర్లలో ఆలౌట్) 367.
వికెట్ల పతనం: 1-21; 2-36; 3-113; 4-136; 5-140; 6-170; 7-304; 8-325; 8-338 (బ్రాడ్ రిటైర్డ్‌హర్ట్); 9-367.
బౌలింగ్: భువనేశ్వర్ 24-7-75-3; పంకజ్ 28-5-113-2; ఆరోన్ 26-4-97-3; అశ్విన్ 14-1-29-0; జడేజా 13.3-1-36-1.
 
భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ ఎల్బీడబ్ల్యు (బి) వోక్స్ 18; గంభీర్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 18; పుజారా ఎల్బీడబ్ల్యు (బి) అలీ 17; కోహ్లి (సి) బెల్ (బి) అండర్సన్ 7; రహానే (సి) అండ్ (బి) అలీ 1; ధోని (సి) బ్యాలెన్స్ (బి) అలీ 27; జడేజా (సి) జోర్డాన్ (బి) అలీ 4; అశ్విన్ నాటౌట్ 46; భువనేశ్వర్ రనౌట్ 10; ఆరోన్ (సి) బట్లర్ (బి) జోర్డాన్ 9; పంకజ్ (బి) జోర్డాన్ 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (43 ఓవర్లలో ఆలౌట్) 161.
వికెట్ల పతనం: 1-26; 2-53; 3-53; 4-61; 5-61; 6-66; 7-105; 8-133; 9-161; 10-161
బౌలింగ్: అండర్సన్ 9-4-18-2; వోక్స్ 9-2-37-1; జోర్డాన్ 12-1-65-2; అలీ 13-3-39-4.
 
31 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలో భారత జట్టు 66 పరుగులలోపే 6 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి అనుభవం భారత్‌కు చివరిసారి 1983లో కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఎదురైంది.
1952 ఇంగ్లండ్ పర్యటనలో ఓల్డ్ ట్రాఫర్డ్‌లో జరిగిన టెస్టులోనూ భారత జట్టు రెండు ఇన్నింగ్స్‌లలో 66 పరుగులలోపే 6 అంతకంటే ఎక్కువ వికెట్లు కోల్పోయింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 207 పరుగులతో గెలిచింది.
1967 తర్వాత ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టులో భారత టాప్-7 బ్యాట్స్‌మెన్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 191 పరుగులు చేశారు.
నాలుగో టెస్టు మొత్తం 1,171 బంతుల్లోనే (195.1 ఓవర్లు) ముగిసింది. భారత, ఇంగ్లండ్‌ల మధ్య ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన మ్యాచ్ ఇదే కావడం విశేషం.
సెషన్-1 పంకజ్‌కు రెండు వికెట్లు
237/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన రూట్, బట్లర్ నిలకడగా ఆడారు. రెండో ఓవర్‌లోనే రూట్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.  భారత ఫీల్డింగ్ వైఫల్యంతో బట్లర్ రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్యాట్స్‌మన్ 34 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి ఎడమవైపు డైవ్ చేసినా అందుకోలేకపోగా... 45 పరుగుల వద్ద ధోని సులువైన రనౌట్ మిస్ చేశాడు. అయితే లంచ్‌కు కొద్ది ముందు పంకజ్ సింగ్ మూడు ఓవర్ల వ్యవధిలో రూట్, బట్లర్‌ను అవుట్ చేశాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. వోక్స్ (26 నాటౌట్), బ్రాడ్ (12) మరో వికెట్ పడకుండా లంచ్‌కు వెళ్లారు. ఓవరాల్‌గా ఈ సెషన్‌లో భారత బౌలర్ల వైఫల్యం ఇంగ్లండ్‌కు ఆధిక్యాన్ని సమకూర్చిపెట్టింది.
ఓవర్లు: 26; పరుగులు: 88; వికెట్లు: 2
 
సెషన్-2 తడబడిన భారత్
లంచ్ తర్వాత ఆరోన్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లు బాదిన బ్రాడ్.. తర్వాతి బంతికే గాయపడ్డాడు. వేగంగా వచ్చిన షార్ట్ పిచ్ డెలివరి హెల్మెట్‌లో నుంచి దూసుకుపోయి బ్యాట్స్‌మన్ ముక్కును బలంగా తాకింది. దీంతో అతను రిటైర్డ్‌హర్ట్ అయ్యాడు. ఓ ఎండ్‌లో వోక్స్ వేగంగా ఆడినా... రెండో ఎండ్‌లో అండర్సన్ (9) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు 29 పరుగులు జోడించారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఓపెనర్లు విజయ్ (18), గంభీర్ (18) ఆరంభంలోనే తడబడ్డారు. కొత్త బంతితో చెలరేగిన అండర్సన్, వోక్స్‌లను సమర్థంగా ఎదుర్కొలేకపోయారు. పరుగులు చేయడానికి ఇబ్బందికి గురైన విజయ్...వోక్స్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. తర్వాత గౌతీతో జత కలిసిన పుజారా ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు.
ఓవర్లు: 8.3; పరుగులు: 42; వికెట్లు: 2 (ఇంగ్లండ్)
ఓవర్లు: 15; పరుగులు: 33; వికెట్లు: 1 (భారత్)

 
సెషన్-3... 13 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు
టీ విరామం తర్వాత ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. ఓ ఎండ్‌లో పేసర్లను మార్చి ప్రయోగించిన కుక్... రెండో ఎండ్‌లో మాత్రం అలీని కొనసాగించాడు. ఈ వ్యూహం అద్భుతంగా పని చేసింది. అప్పటి వరకు నిలకడగా ఆడుతున్న గంభీర్‌ను, మరి కొద్దిసేపటికి కోహ్లి (7)ని అండర్సన్ బోల్తా కొట్టిస్తే... అలీ తన వరుస మూడు ఓవర్లలో పుజారా (17), రహానే (1), జడేజా (4)లను పెవిలియన్‌కు పంపాడు.

దీంతో భారత్ 13 పరుగుల తేడాలో 5 కీలక వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది. తర్వాత ధోని (27), అశ్విన్‌లు కాసేపు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అలీ మరో అద్భుతమైన బంతితో ధోనిని దెబ్బతీస్తే... ఆ వెంటనే భువనేశ్వర్ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. తర్వాత అశ్విన్ భారీ షాట్లతో ఎక్కువ భాగం స్ట్రయికింగ్ చేశాడు. కానీ వరుణ్ ఆరోన్ (9), పంకజ్ సింగ్ (0)లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.  జోర్డాన్ వేసిన వరుస బంతుల్లో వీరిద్దరు అవుట్ కావడంతో భారత్‌కు
ఓటమి తప్పలేదు.
ఓవర్లు: 28; పరుగులు: 128; వికెట్లు: 9

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement