మ్యాచ్ డ్రా చేసుకున్నా లాభం లేదు: అండర్సన్
ముంబై: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో వెనకంజలో ఉన్నా ఇంగ్లండ్ ఆటగాళ్ల మాటలు మాత్రం ఆ స్థాయిలో లేవు. ఇక్కడ జరుగుతున్న నాలుగోటెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. నేడు ఆట నిలిపివేసిన తర్వాత ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మీడియాతో మాట్లాడాడు. తమ ఆటగాళ్లు చివరిరోజున ఐదురోజు సాధ్యమైనన్ని పరుగులు చేసేందుకు బ్యాటింగ్ చేస్తారన్నాడు. డ్రా చేసే దిశగా తమ జట్టు ఆలోచించడం లేదని చెప్పాడు.
సిరీస్ లో ఇప్పటికే భారత్ 2-0 ఆధిక్యంలో ఉండగా, ఈ టెస్ట్ కూడా కోల్పోతే తమకు కోలుకునే అవకాశం ఉందని అండర్సన్ అన్నాడు. టెస్ట్ డ్రా చేసుకున్నా జట్టుకు సిరీస్ ఓటమి తప్పదని, అందుకే ఎదురుదాడే తమ మార్గమని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ(235), జయంత్ యాదవ్ సెంచరీ(104)లతో చెలరేగడంతో భారత్ 631పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ రూట్ హాఫ్ సెంచరీ(77), బెయిర్ స్టో(50 నాటౌట్) రాణించకుంటే తక్కువ స్కోరుకే ఆలౌటయ్యేది. భారత్ ఇంకా 49 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.