భారత్ ఆరాటం.. ఇంగ్లండ్ పోరాటం
ముంబై:ఒకవైపు నాల్గో టెస్టులో గెలిచి సిరీస్ ను ముందుగానే సాధించాలని భారత్ భావిస్తుండగా, మరొకవైపు ఇంగ్లండ్ కనీసం డ్రాతో బయటపడాలనే యోచిస్తోంది. ఈ క్రమంలోనే విజయం కోసం భారత్ ఆరాటపడుతుండగా, ఇంగ్లండ్ మాత్రం ఓటమి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా పోరాడుతోంది. నాల్గో రోజు ఆట మగిసే సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఇక ఇంగ్లండ్ ఓటమి తప్పించుకోవాలంటే సోమవారం చివరిరోజు పూర్తిగా పోరాడాల్సి వుంది. అలా జరగని పక్షంలో భారత్ విజయాన్ని అడ్డుకోవడం కష్టం.ప్రస్తుతం ఇంగ్లండ్ ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉండటంతో భారత్ విజయం దాదాపు ఖాయంగానే కనబడుతోంది.
ఈ రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో జెన్నింగ్స్(0), అలెస్టర్ కుక్(18), మొయిన్ అలీ(0)లు తీవ్రంగా నిరాశపరచగా, జో రూట్(77),బెయిర్ స్టో(50)హాఫ్ సెంచరీలు సాధించి పెవిలియన్ చేరారు. అయితే ఆరో వికెట్ గా బాల్(2)అవుటయ్యాడు.ఈ ఆరు వికెట్లలో జడేజా,అశ్విన్ లు తలో రెండు వికెట్లు తీయగా, జయంత్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ లకు చెరో వికెట్ దక్కింది.
అంతకుముందు భారత్ తన ఇన్నింగ్స్ లో 631 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటైంది. విరాట్ కోహ్లి(235) డబుల్ సెంచరీ సాధించగా, జయంత్ యాదవ్(104)పరుగులను సాధించాడు. మురళీ విజయ్(136) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. మరో ఆటగాడు చటేశ్వర పూజారా(47) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. 451/7 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆదివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. తొలి సెషన్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది.ఓవర్ నైట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి-జయంత్ యాదవ్లో కీలక భాగస్వామ్యాన్ని సాధించి జట్టును మరింత పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ ఇద్దరూ 241పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇందులో కేవలం 23 ఫోర్లు మాత్రమే ఉండగా, మిగతా వందకు పైగా పరుగులను సింగిల్స్, డబుల్స్ ద్వారానే సాధించాడు. మరొకవైపు జయంత్ యాదవ్(104;204 బంతుల్లో 15 ఫోర్లు) శతకంతో మెరిశాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 400 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 182/6
భారత్ తొలి ఇన్నింగ్స్ 631 ఆలౌట్