సాక్షి క్రీడా విభాగం: గత కొన్నేళ్లలో వన్డేల్లో భారీగా పరుగులు సాధించిన, రికార్డులు నమోదు చేసిన కోహ్లి, రోహిత్, గేల్, డివిలియర్స్ తదితర ఆటగాళ్లతో కూడిన జాబితాను చూస్తే ఇయాన్ మోర్గాన్ పేరు కనిపించదు. అతను ఓపెనర్ కాకపోవడమే అందుకు ప్రధాన కారణం. మోర్గాన్ తన కెరీర్‌లో ఎక్కువ భాగం ఐదో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగాడు. ఇంగ్లండ్ కూడా తమ జట్టుకు ఫినిషర్‌గానే అతడిని చూసింది. అయితే మొదటి నుంచీ అతని బ్యాటింగ్ శైలి దూకుడుగానే ఉంటుంది. రెండు దేశాల తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అరుదైన ఆటగాళ్లలో మోర్గాన్ కూడా ఒకడు.
ఐర్లాండ్‌లో పుట్టిన అతను తన మాతృదేశం తరఫునే అరంగ్రేటం చేశాడు. స్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అయిన మోర్గాన్... 99 పరుగుల వద్ద రనౌట్ అయి ఆ మ్యాచ్‌ను ఎప్పటికీ మరచిపోలేని విధంగా మార్చుకున్నాడు! దాదాపు మూడేళ్ల పాటు ఐర్లాండ్‌కు ఆడిన (23 వన్డేలు) అనంతరం అతడిని ఇంగ్లండ్ సాదరంగా ఆహ్వానించింది. అనంతరం 2010 టి20 ప్రపంచ కప్‌ను గెలుచున్న ఇంగ్లండ్ జట్టులో మోర్గాన్ కీలక పాత్ర పోషించాడు. మధ్యలో టెస్టు క్రికెటర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా, అది తన వల్ల కాదని గుర్తించి రెండేళ్లకే గుడ్‌బై చెప్పేశాడు. ఐపీఎల్ అనుభవంతో అతని బ్యాటింగ్‌లో మరింత ధాటి పెరిగింది. ఆ తర్వాత బ్యాట్స్‌మన్‌గా మోర్గాన్ స్థానానికి తిరుగు లేకుండా పోయింది.
మోర్గాన్ కెరీర్‌లో మేలి మలుపు 2014 క్రిస్మస్ సమయంలో వచ్చింది. వన్డేల్లో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన చూసీ చూసీ విసుగెత్తిన బోర్డు ఉన్నపళంగా కుక్‌ను తప్పించేసి మోర్గాన్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. రెండు నెలల తర్వాత జరిగిన ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన కొనసాగింది. బంగ్లా చేతిలో ఓటమితో క్వార్టర్ ఫైనల్ అవకాశం పోయింది. ఇంకా నాయకుడిగా కుదురుకోని మోర్గాన్ కూడా విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత జట్టు ప్రక్షాళన కార్యక్రమం సాగింది. వన్డేల నుంచి సీనియర్లు అండర్సన్, బ్రాడ్, బెల్‌లను తప్పించడంలో మోర్గాన్‌దే కీలక పాత్ర. ఆ తర్వాత విధ్వంసక బ్యాట్స్‌మెన్‌తో జట్టును నింపి స్వయంగా చెలరేగి ఆడుతూ సహచరులలో స్ఫూర్తిని నింపాడు.
అంతే...ఇంగ్లండ్ కొత్త ప్రస్థానం మొదలైంది. వన్డేల్లో ప్రపంచ రికార్డు స్కోరు నమోదు చేసిన జట్టు మళ్లీ అదే రికార్డును బద్దలు కొట్టింది. 2015 ప్రపంచ కప్ తర్వాత ఈ వరల్డ్ కప్‌కు ముందు ఏకంగా 18 సార్లు 350కు పైగా స్కోర్లు నమోదు చేస్తే నాలుగు సార్లు 400 పరుగులు దాటింది. వన్డేల్లో నంబర్‌వన్‌గా అవతరించిన ఇంగ్లండ్... మోర్గాన్ నాయకత్వంలో ఆడిన 13 వన్డే సిరీస్‌లలో 12 గెలుచుకుంది. ఇప్పుడు సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఫేవరెట్‌గా చూస్తున్నారంటే అదంతా గత నాలుగేళ్లలో మోర్గాన్ నాయకత్వంలో వచ్చిన మార్పే కారణం. ఒక ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ అత్యధికంగా 22 సిక్సర్లు (2007లో) కొడితే ఇవాళ ఒక్క మ్యాచ్‌లోనే జట్టు 25 సిక్సర్లు బాదింది. తన బ్యాటింగ్‌తో పాటు ఇదే జోరును జట్టు కొనసాగిస్తే వరల్డ్ కప్ విజేతగా ఈ ‘ఐరిష్ మ్యాన్’ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.
2003 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాలో ఉండి ప్రేక్షకుడిగా చూశాను. కాడిక్ బౌలింగ్‌లో పక్కకు జరుగుతూ మిడ్‌వికెట్ మీదుగా టెండూల్కర్ కొట్టిన భారీ సిక్సర్ దాదాపు మైదానం బయటకు వెళ్లింది. నా జీవితంలో అలాంటి భారీ సిక్సర్ ఎప్పుడూ చూడలేదు. మ్యాచ్ గురించి నాకు ఆ సిక్సర్ తప్ప ఏమీ గుర్తు లేదు. అప్పటినుంచి సిక్సర్ల మోజు పెరిగిపోయిందంతే.
–ఒక ఇంటర్వ్యూలో మోర్గాన్
Comments
Please login to add a commentAdd a comment