
ఢీ అంటే ఢీ
యూరప్ 4 - అమెరికా 4
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అన్ని దేశాలూ ఆడినా... నిజానికి ఇది అమెరికా ఖండంలోని దేశాలు, యూరప్ ఖండంలోని దేశాల మధ్య పోరాటం. ఎవరికి వారికి సొంత ఖండంలో ప్రతిష్టాత్మక టోర్నీలు ఉన్నాయి. దీంతో ప్రపంచంలో ఆధిపత్యం ఎవరిదో తేల్చుకోవాలని ఈ రెండు ఖండాల్లోని జట్లు తహతహలాడుతూ ఉంటాయి. ఇప్పటివరకు జరిగిన 19 ప్రపంచకప్‌లలోనూ ఇదే జరిగింది. ఇందులో 10 సార్లు యూరప్ జట్లు గెలిస్తే... 9 సార్లు అమెరికా జట్లు నెగ్గాయి. కాకతాళీయమే అయినా ఈసారి కూడా క్వార్టర్స్ దశకు ఈ రెండు ఖండాలకు చెందిన ఎనిమిదే జట్లే వచ్చాయి. యూరప్ నుంచి నాలుగు, అమెరికా నుంచి నాలుగు జట్లు రేసులో నిలిచాయి.
సాక్షి క్రీడా విభాగం
ఫిఫా ప్రపంచకప్ మొదలై 22 రోజులవుతోంది. ఆరు ఖండాల నుంచి 32 జట్లు బరిలోకి దిగాయి. కొన్ని లీగ్ దశలోనే వెనుదిరిగితే... మరికొన్ని ప్రిక్వార్టర్స్ అడ్డంకిని అధిగమించలేకపోయాయి. చివరకు యూరప్, అమెరికా ఖండాలకు చెందిన ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, కోస్టారికా, బ్రెజిల్, కొలంబియా, అర్జెంటీనా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి.
అయితే ఇప్పటి వరకు జరిగిన 19 ప్రపంచకప్‌ల్లో 10సార్లు యూరప్ జట్లు విజేతగా నిలిస్తే... 9 సార్లు అమెరికా టీమ్‌లు ట్రోఫీని చేజిక్కించుకున్నాయి. ప్రస్తుతం ఈ టోర్నీ కూడా అమెరికా, యూరప్ ఆధిపత్యానికి సవాలుగా నిలుస్తోంది. మరి ఏ ఖండం జట్లు సెమీస్ రేసులో నిలుస్తాయో చూడాలి. ఓవరాల్‌గా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో కొన్ని ఖండాల జట్లు సరైన ముద్ర వేయలేకపోయాయి. మరోవైపు టాప్ జట్లు కూడా కొంత తడబాటుకు గురైనా... నాకౌట్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. ఇక నాకౌట్‌లో పరిస్థితి ఏంటనేది ఆసక్తికరం.
సెమీస్‌లోనూ ఇద్దరికీ...
ఈసారి సెమీఫైనల్లోనూ రెండు ఖండాలకు చెందిన జట్లకు అవకాశం ఉంటుంది. క్వార్టర్ ఫైనల్స్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఆయా ఖండాలకు చెందిన జట్లే పరస్పరం తలపడుతున్నాయి. ఫ్రాన్స్‌తో జర్మనీ; బ్రెజిల్‌తో కొలంబియా ఆడతాయి. కాబట్టి మిగిన రెండు మ్యాచ్‌ల్లో ఒకే ఖండానికి చెందిన జట్లు గెలిచినా... ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాల వల్ల కచ్చితంగా రెండో ఖండానికి చెందిన జట్టుకు కూడా సెమీస్‌లో చోటు ఉంటుంది.
ఆసియా ఊసే లేదు
ప్రపంచకప్‌లో ఆసియా నుంచి 4, ఆఫ్రికా నుంచి 5 జట్లు బరిలోకి దిగాయి. అయితే ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం, పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఆసియా జట్లు లీగ్ దశలోనే వెనుదిరిగాయి. కానీ హోరాహోరీ పోటీ తర్వాత ఆఫ్రికా నుంచి కేవలం అల్జీరియా, నైజీరియా మాత్రమే నాకౌట్‌కు అర్హత సాధించాయి. అయితే ప్రిక్వార్టర్స్‌లో అల్జీరియా 1-2తో జర్మనీ చేతిలో; నైజీరియా 0-2తో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయాయి. దీంతో ప్రపంచకప్‌లో ఆఫ్రికా జట్లు ప్రిక్వార్టర్స్ వరకే పరిమితమయ్యాయి.
టాప్ జట్ల తడబాటు
ఈ టోర్నీలో నెదర్లాండ్స్, అర్జెంటీనా, బ్రెజిల్ జట్లు టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగినా ఆటతీరు మాత్రం ఆ స్థాయిలో లేదు. లీగ్ దశలో నెదర్లాండ్స్, అర్జెంటీనా ఆడిన మూడు మ్యాచ్‌లు గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంటే.. బ్రెజిల్ మాత్రం కాస్త శ్రమించింది. అయితే నాకౌట్ దశకు వచ్చేసరికి టాప్ జట్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. జట్లలో స్టార్ ఆటగాళ్లకు కొదవలేకున్నా నిర్ణీత సమయంలో గోల్స్ చేయలేకపోయారు. ప్రత్యర్థిగా చిన్న జట్లే ఉన్నా వాళ్లను కూడా నిలువరించలేకపోయారు.
దీంతో చిలీతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ పెనాల్టీ షుటౌట్‌లో బయటపడి ఊపిరి పీల్చుకుంటే... జర్మనీ, అర్జెంటీనా, బెల్జియం ఎక్స్‌ట్రా టైమ్‌లో గోల్స్‌తో గట్టెక్కాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, కొలంబియా మాత్రమే నిర్ణీత సమయంలో మ్యాచ్‌ను ముగించాయి. ఓవరాల్‌గా ఈ టోర్నీలో టాప్ జట్లు అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్నాయి. కనీసం క్వార్టర్‌ఫైనల్లోనైనా ఈ పరిస్థితిలో మార్పు రాకుంటే ఫేవరెట్స్ అనుకుంటున్న జట్లన్నీ ఇంటి దారి పట్టే ప్రమాదం ఉంది.