
కేప్‌టౌన్: ఇక నుంచి బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ పేర‍్కొన్నాడు. ఇటీవల కాలంలో బాల్ ట్యాంపరింగ్ ఉదంతాలు తరుచు వెలుగు చూడటంతో డుప్లెసిస్ స్పందించాడు. బాల్ ట్యాంపరింగ్ పాల్పడే వారి కోసం ప్రస్తుతం అవలంభిస్తున్న నిబంధనల్ని కఠినతరం చేయాలన్నాడు.
‘బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తే మంచిది. ప్రస్తుతం ఉన్న విధానంతో ఎటువంటి ఉపయోగం కనబడటం లేదు. అవి తరచు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఐసీసీ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి పదునుపెట్టాలి. బాల్ ట్యాంపరింగ్‌కు చెక్ పెట్టాలంటే జరిమానా అనేది పరుషంగా ఉండాల్సిందే. అప్పుడే బాల్ ట్యాంపరింగ్ ఫుల్‌స్టాప్ పడుతుంది’ అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.
మరికొద్ది రోజుల్లో శ్రీలంకతో సుదీర్ఘ పర్యటనకు సిద్దమవుతున్న తరుణంలో డుప్లెసిస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల శ్రీలంక కెప్టెన్ చండిమాల్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఒక టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే ట్యాంపరింగ్‌కు కారణమైన ప‍్రతీ ఒక్కరికీ ఒక నిబంధన ఉండేలా చూడాలని డుప్లెసిస్ సూచించాడు. ఐసీసీ నిబంధనల్లో క్లారిటీతో పాటు నిలకడ ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక‍్కడ కఠినమైన శిక్షలు పడితేనే బాల్ ట్యాంపరింగ్ ఉదంతాలకు చరమగీతం పాడే అవకాశం ఉందన‍్నాడు.