
ఈస్ట్ లండన్: చాలా సందర్భాల్లో సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతుంటాం. ఇందుకు ఏదీ అనర్హం కాదేమో. ఇటీవల జింబాబ్వేతో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ టాస్ వేసే సమయంలో తనకు కూడా సెంటిమెంట్ ఉందనే విషయాన్ని బయటపెట్టాడు. సాధారణంగా క్రికెట్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి మాత్రమే టాస్ వేయడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. టాస్ కాయిన్‌ను ఎగురవేయడానికి సహచర ఆటగాడు జేపీ డుమినీని నియమించుకున్నాడు.
గత మంగళవారం జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భాగంగా టాస్ వేసేందుకు డుప్లెసిస్‌తో పాటు డుమినీ కూడా మైదానంలోకి వచ్చాడు. ఇక్కడ టాస్ వేసేందుకు కాయిన్‌ను డుమినీ చేతికిచ్చాడు డుప్లెసిస్. వరుసగా ఆరు మ‍్యాచ్‌ల్లో టాస్ ఓడిపోవడంతో డుమినీని సెంటిమెంట్‌గా నమ్ముకున్నాడు. ఈ క్రమంలోనే డుమినీ చేత టాస్ వేయించాడు. దక్షిణాఫ్రికా టాస్ గెలవడంతో డుప్లెసిస్ నమ‍్ముకున్న సెంటిమెంట్ నిజమైనట్లయ్యింది. మరొక విషయం ఏంటంటే, ఆ మ్యాచ్‌లో డుమినీ తుది జట్టులో లేడు.
కాగా, ఇలా డుమినీ చేత టాస్ వేయించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్న డుప్లెసిస్.. ఆ క్షణాల్ని ఎంతో ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు. డుమినీ టాస్ వేయడంలో స్పెషలిస్టు అంటూ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఇది మంచి మజాను తీసుకొచ్చిందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment