ఈ ఏడాది (2023) ఐపీఎల్‌లో, అంతకుముందు జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మెరుపులు మెరిపించిన సౌతాఫ్రికన్ లెజెండ్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) ఇనాగురల్ ఎడిషన్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఎంఎల్‌సీ-2023లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన డుప్లెసిస్.. తన క్రికెటింగ్ కెరీర్‌లోకెళ్లా అత్యంత దారుణమైన గణాంకాలు నమోదు చేశాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 6.57 సగటున 85.18 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు.
లీగ్ క్రికెట్‌లో ఘన చరిత్ర కలిగిన డప్లెసిస్.. తన 13 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు ఏ లీగ్‌లోనూ ఇంత పేలవ ప్రదర్శన కనబర్చలేదు. డుప్లెసిస్ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ ఆందోళన చెందుతుంది. ఆ జట్టు అభిమానుల బాధ వర్ణణాతీతంగా ఉంది. డుప్లెసిస్ వచ్చే సీజన్‌లో ఎలాగైనా తమకు ఐపీఎల్ టైటిల్ సాధించిపెడతాడని గంపెడాశలు పెట్టుకున్న ఆర్సీబీ అభిమానులు.. ఫాఫ్ దయనీయ పరిస్థితి చూసి కుమిలిపోతున్నారు. ఇలాగైతే 2024లో కూడా తాము టైటిల్ గెలిచినట్లే అని తలలుపట్టుకుంటున్నారు.
ఎంఎల్‌సీలో చెన్నై సూపర్ కింగ్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన డుప్లెసిస్.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 9 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి లీగ్ నుంచి నిష్క్రమించింది. భారతకాలమానం రేపు (జులై 31) జరుగబోయే ఫైనల్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్.. సియాటిల్ ఆర్కాస్‌ను ఢీకొంటుంది.
కాగా, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కొనసాగుతున్న డుప్లెసిస్.. ఎంఎల్‌సీ మినహాయించి ఈ ఏడాది టీ20 లీగ్‌ల్లో మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన అతను.. 56.15 సగటున, 153.68 స్ట్రయిక్ రేట్‌తో 730 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో 11 మ్యాచ్‌ల్లో 41 సగటున, 147.60 స్ట్రయిక్‌రేట్‌తో 369 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment