అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ ఆరంభ ఎడిషన్‌లో సీయాటిల్ ఆర్కాస్ ఫ్రాంచైజీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ జట్టు సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో ఇవాళ (జులై 22) జరిగిన మ్యాచ్‌లో ఆర్కాస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు కెప్టెన్ వేన్ పార్నెల్ నిప్పులు చెరగడంతో (5/20) తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 127 పరుగులకే కుప్పకూలింది.
పార్నెల్.. సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించగా, ఆండ్రూ టై (2/15), ఇమాద్ వసీం (1/25), గానన్ (1/30) మిగతా పనిని పూర్తి చేశారు. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ బ్రేవో (39) టాప్ స్కోరర్‌గా నిలువగా..డేనియల్ సామ్స్ (26), కోడీ చెట్టి (22), డుప్లెసిస్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటై డెవాన్ కాన్వే (0) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (8), మిచెల్ సాంట్నర్ (2) దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్కాస్.. 16 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (53) అర్ధసెంచరీతో రాణించగా.. హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆర్కాస్ కోల్పోయిన రెండు వికెట్లలో ఒకటి సాంట్నర్, మరొకటి మొహమ్మద్ మొహిసిన్ దక్కించుకున్నాడు.
ఈ గెలుపుతో ఆర్కాస్ టేబుల్ టాపర్‌గా (3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) నిలువగా.. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వాషింగ్టన్ ఫ్రీడం (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), ముంబై ఇండియన్స్ న్యూయార్క్ (3 మ్యాచ్‌ల్లో ఓ విజయం), లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment