మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) 2024 ఎడిషన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో ఇవాళ (భారతకాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.
డుప్లెసిస్ మెరుపు అర్ద సెంచరీ
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డెవాన్ కాన్వే (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, సిక్సర్) చెలరేగి ఆడటంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ 22, జాషువ ట్రంప్ 3, మిలింద్ కుమార్ 2, సావేజ్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. స్టోయినిస్ 24, డ్వేన్ బ్రావో 7 పరుగులతో అజేయంగా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ (4-0-17-1) పొదుపుగా బౌలింగ్ చేయగా.. ట్రెంట్ బౌల్ట్ 2, నోష్తుష్ కెంజిగే, ఎహసాన్ ఆదిల్ తలో వికెట్ పడగొట్టారు.
రషీద్ ఖాన్ వీరోచిత పోరాటం వృధా
177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. మెనాంక్ పటేల్ (45 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రషీద్ ఖాన్ (23 బంతుల్లో 50; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రషీద్ పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు బ్యాటింగ్ చేశాడు. రషీద్ వీరోచితంగా పోరాడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో కీరన్ పోలార్డ్ (17 బంతుల్లో 5), టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 6) చాలా బంతులు వృధా చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్ 4, జియా ఉల్ హక్ 2, మొహమ్మద్ మోహిసిన్ ఓ వికెట్ పడగొట్టారు.
ఇదిలా ఉంటే, మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ జులై 5న మొదలైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) టాప్‌లో ఉండగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (రాత్రి ఒంటి గంటకు) జరుగబోయే మ్యాచ్‌లో సీయాటిల్ ఓర్కాస్, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్ తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment