Mumbai Indians New York Wins Inaugural MLC Title By Defeating Seattle Orcas In Finals - Sakshi
Sakshi News home page

MLC 2023: ముంబై ఇండియన్స్‌ ఖాతాలో మరో టైటిల్‌.. ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్‌

Published Mon, Jul 31 2023 3:16 PM | Last Updated on Mon, Jul 31 2023 3:47 PM

Mumbai Indians New York Wins Inaugural MLC Title By Defeating Seattle Orcas In Finals - Sakshi

అమెరికా వేదికగా జరిగిన మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ ఇనాగురల్‌ టైటిల్‌ను (2023) ముంబై ఇండియన్స్‌ అనుబంధ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ ఎగరేసుకుపోయింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (జులై 31) ఉదయం జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్‌.. సియాటిల్‌ ఆర్కాస్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఎంఎల్‌సీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. సీజన్‌ ఆరంభంలో వెనుకపడిన ఎంఐ న్యూయార్క్‌.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని హ్యాట్రిక్‌ విజయాలతో టైటిల్‌ను నెగ్గింది.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడంపై నెగ్గిన ఎంఐ.. ఆతర్వాత ఛాలెంజర్‌ మ్యాచ్‌లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌పై, ఫైనల్లో పటిష్టమైన సియాటిల్‌ ఆర్కాస్‌పై నెగ్గి విజేతగా ఆవిర్భవించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్‌ ఖాతాలో తొమ్మిదో టీ20 టైటిల్‌ చేరింది. ముకేశ్‌ అంబానీ అండ్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడిచే ముంబై ఇండియన్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఫ్రాంచైజెస్‌ 2011, 2013 ఛాంపియన్స్‌ లీగ్‌ టైటిళ్లను, ఆతర్వాత 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్‌ టైటిళ్లను, ఈ ఏడాదే (2023) ప్రారంభమైన మహిళల ఐపీఎల్‌ టైటిల్‌ను, తాజాగా మేజర్‌ లీగ్‌ టీ20 టైటిల్‌ను నెగ్గాయి.   

ప్రపంచ రికార్డు సమం చేసిన పోలార్డ్‌
మేజర్‌ లీగ్‌ టీ20 లీగ్‌ 2023 టైటిల్‌ నెగ్గడం ద్వారా ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ జట్టు సభ్యుడు కీరన్‌ పోలార్డ్‌.. తన దేశానికే చెందిన సహచర ఆటగాడు డ్వేన్‌ బ్రావో పేరిట ఉన్న అత్యధిక టీ20 టైటిళ్ల ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఓ ఆటగాడిగా బ్రావో 16 టీ20 టైటిళ్లలో భాగం కాగా.. ఎంఎల్‌సీ టైటిల్‌తో పోలార్డ్‌, బ్రావో రికార్డును సమం చేశాడు. పోలార్డ్‌ కూడా ఆటగాడిగా 16 టీ20 టైటిళ్లలో భాగమయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో షోయబ్‌ మాలిక్‌ (13), రోహిత్‌ శర్మ (10), ధోని (9), లసిత్‌ మలింగ (9) ఉన్నారు.

నిప్పులు చెరిగిన బౌల్డ్‌.. రషీద్‌ మాయాజాలం
ఎంఎల్‌సీ 2023 ఫైనల్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్కాస్‌.. ట్రెంట్‌ బౌల్డ్‌ (4-0-34-3), రషీద్‌ ఖాన్‌ (4-0-9-3) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్‌ డికాక్‌ (52 బంతుల్లో 87; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడ్డాడు.

పూరన్‌ ఊచకోత..
అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌.. నికోలస్‌ పూరన్‌ (55 బంతుల్లో 137; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement