చీఫ్ కోచ్‌గానే హావ్‌గుడ్ | Favoured by players, Hawgood returns as chief coach | Sakshi
Sakshi News home page

చీఫ్ కోచ్‌గానే హావ్‌గుడ్

Published Sun, Nov 1 2015 4:22 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

Favoured by players, Hawgood returns as chief coach

న్యూఢిల్లీ: గతంలో రెండేళ్ల పాటు భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా వ్యవహరించిన నీల్ హావ్‌గుడ్ ను ఈసారి అసిస్టెంట్ కోచ్‌గా తీసుకోనున్నట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన మరోసారి చీఫ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. గతేడాది నవంబర్‌లోనే ఆయన వ్యక్తిగత కారణాలతో ఈ పదవి నుంచి తప్పుకున్నారు. సాయ్ అధికారులతో హెచ్‌ఐ సుదీర్ఘంగా చర్చించిన అనంతరం హావ్‌గుడ్‌ను అసిస్టెంట్‌గా కాకుండా చీఫ్ కోచ్‌గానే నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆసీస్‌కు చెందిన హావ్‌గుడ్ హయాంలో జట్టు పురోగతి సాధించింది. 2013 జూనియర్ ప్రపంచకప్‌లో, ఇంచియాన్ ఆసియా గేమ్స్‌లో కాంస్యాలతో పాటు హాకీ వరల్డ్ లీగ్ రౌండ్ 2లో నెగ్గిం ది. కొత్త కోచ్ ఆధ్వర్యంలో మహిళల హాకీ జట్టు ఈనెల 18 నుంచి 30 వరకు అర్జెంటీనాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
 
కేరళ, చెన్నైయిన్ మ్యాచ్ డ్రా
కొచ్చి: వరుసగా నాలుగు పరాజయాలతో డీలా పడిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ జట్టు చెన్నైయిన్ ఎఫ్‌సీతో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట చెన్నైయిన్ జట్టు తరఫున ఎలనో (34వ నిమిషంలో) పెనాల్టీ కిక్ ద్వారా గోల్ సాధించగా... 46వ నిమిషంలో దగ్నల్ గోల్‌తో కేరళ స్కోరును సమం చేసింది. అయితే కేరళకు లభించిన పెనాల్టీ విఫలం కావడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. నేడు (ఆదివారం) జరిగే మ్యాచ్‌లో ముంబై, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement