అవినీతి కేసులో ఆరుగురు ఫిఫా అధికారుల అరెస్ట్
జురిచ్: ప్రపంచ ఫుట్బాల్ రంగంలో అత్యంత శక్తిమంతమైన, వేలాది కోట్ల రూపాయల ఆదాయంతో సుసంపన్నమైన ఫిఫాకు షాక్. అవినీతి ఆరోపణలపై అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య సంఘం (ఫిఫా) అత్యున్నత స్థాయి అధికారులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. స్విట్జర్లాండ్ అధికారులు ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకుని అమెరికాకు అప్పగించారు.
ఫిఫా ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జురిచ్లో ఉంది. జురిచ్లో జరిగిన ఫిఫా వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కార్యవర్గ సభ్యలు వచ్చారు. అమెరికా న్యాయశాఖ విన్నపం మేరకు స్విస్ అధికారులు అకస్మాత్తుగా ఫిఫా అధికారులు బస చేసిన హోటల్పై దాడి చేసి అరెస్ట్ చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఫిఫాలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ ఫుట్కప్ల నిర్వహణకు బిడ్లు, మార్కెటింగ్, ప్రసార హక్కుల ఒప్పందాలకు సంబంధించి ఫిఫా అధికారులు అవినీతికి పాల్పడినట్టు అభియోగాలు వచ్చాయి. అమెరికా విన్నపం మేరకు స్విస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ కేసుపై దృష్టిసారించారు. కాగా ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై అభియోగాలు నమోదు చేయకున్నా అధికారులు ఆయనను విచారించనున్నారు.