బలనిరూపణకు సిద్ధం! | Fighting with Australia in ODIs on home town | Sakshi
Sakshi News home page

బలనిరూపణకు సిద్ధం!

Published Wed, Sep 13 2017 12:48 AM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

బలనిరూపణకు సిద్ధం!

బలనిరూపణకు సిద్ధం!

∙ సొంతగడ్డపై వన్డేల్లో ఆస్ట్రేలియాతో పోరు
∙ పూర్తి స్థాయి జట్టుతో భారత్‌
∙ ప్రపంచ చాంపియన్‌తో సవాల్‌


సరిగ్గా ఏడాది క్రితం భారత జట్టు ఇదే సమయంలో సొంతగడ్డపై వరుసగా టెస్టు మ్యాచ్‌లతో బిజీగా ఉంది. ప్రత్యర్థులు మారినా మన పట్టు మాత్రం ఎక్కడా చేజారకుండా 12 టెస్టుల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పుడు ఈ సీజన్‌లో పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు టీమిండియాను ముంచెత్తనున్నాయి. 2017 ముగిసేలోగా భారత్‌ వన్డేలు, టి20లు కలిపి 20 మ్యాచ్‌లు ఆడనుంది. 2019 ప్రపంచ కప్‌నకు ముందు సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఆటగాళ్లకు కల్పిస్తామని చెబుతున్న నేపథ్యంలో బలాబలాల పరీక్షకు విజిల్‌ మోగినట్లే.

శ్రీలంకపై వన్డేలు, టి20ల్లో కూడా క్లీన్‌ స్వీప్‌... అయితే ప్రస్తుతం లంక జట్టు పరిస్థితిని చూస్తే భారత్‌ విజయానికి పెద్దగా విలువ లేకుండా పోయింది. ఆ సిరీస్‌కు వచ్చిన స్పందన కూడా అంతంత మాత్రమే. ఇప్పుడు మరోసారి గట్టి ప్రత్యర్థితో పోరు, హోరాహోరీ మ్యాచ్‌లతో మన రిజర్వ్‌ ఆటగాళ్ల అసలు బలమేమిటో తెలుస్తుంది. ఆస్ట్రేలియా రూపంలో ఆ సవాల్‌తో మన పరీక్ష మొదలు కానుంది. కొన్నాళ్ల క్రితం న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ కూడా వన్డేల్లో మనకు పోటీనిచ్చాయి. ఆ కోణంలో చూస్తే ప్రపంచ చాంపియన్‌ ఆసీస్‌ను                     ఎదుర్కోవడం అంత సులువు కాదు.   

సాక్షి క్రీడా విభాగం :  భారత్‌లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఏడు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడితే అందులో భారత్‌ మూడు గెలిచి, నాలుగు ఓడింది. ఆఖరిసారిగా నాలుగేళ్ల క్రితం 2013లో జరిగిన సిరీస్‌లో అయితే పరుగుల వరద పారింది. అనేక రికార్డులు నమోదై భారత్‌ 3–2తో గెలిచిన ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా కూడా దీటుగా ఆడింది. ఏ రకంగా చూసినా ఆసీస్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఈ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా ఎంపిక చేసిన 14 మందిలో ముగ్గురు మినహా అందరికీ రెగ్యులర్‌గా ఐపీఎల్‌లో ఆడుతున్న అనుభవం, ఇక్కడి పరిస్థితులపై అంచనా ఉన్నాయి. భారత్‌లో ఇటీవల ఆడి ఓడిన టెస్టు జట్టు బలహీనంగా కనిపించినా... వన్డే ఆటగాళ్లకు మాత్రం టీమిండియాను చక్కగా ఎదుర్కోగల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా రెండో, భారత్‌ మూడో ర్యాంక్‌లో ఉన్నాయి. ఈ సిరీస్‌ను కోహ్లి సేన 4–1తో గెలుచుకుంటే నంబర్‌వన్‌ ర్యాంక్‌ జట్టు సొంతమవుతుంది.  

కుర్రాళ్లు నిరూపించుకోవాలి...
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో స్పిన్నర్లు అక్షర్‌ పటేల్, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్‌ ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చారు. ఇప్పుడు ఈ ముగ్గురినీ ఆస్ట్రేలియాలాంటి జట్టుపై సత్తా చాటేందుకు సరైన అవకాశంగా చెప్పవచ్చు. స్పిన్‌ను సమర్థంగా ఆడగల స్మిత్, వార్నర్‌లను వీరు కట్టడి చేయగలిగితే భారత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించినవారవుతారు. విశ్రాంతి కావచ్చు లేదా వేటు కావచ్చు... కారణమేదైనా భారత ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు జట్టుకు దూరం కావడంతో కుర్ర స్పిన్నర్లు తమదైన ముద్ర చూపించవచ్చు. టెస్టుల్లో అద్భుతమైన విజయాలు అందించినా... పరిమిత ఓవర్లలో అశ్విన్, జడేజాలను దాటి కెప్టెన్‌ కోహ్లి ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. వేర్వేరు శైలి గల ఈ ముగ్గురు స్పిన్నర్లను మరింత రాటుదేల్చే ప్రయత్నంలో అతను ఉన్నాడు.

అవసరమైతే కేదార్‌ జాదవ్‌తో ఆఫ్‌ స్పిన్‌ వేయించుకోవచ్చు కాబట్టి స్పెషలిస్ట్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ జట్టులో కనిపించడం లేదు. అయితే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో బ్యాటింగ్‌లో చెలరేగిన జాదవ్‌... శ్రీలంకతో నాలుగో వన్డే మినహా వరుసగా విఫలమయ్యాడు. మున్ముందు జట్టులో కొనసాగాలంటే అతను కూడా రాణించడం అవసరం. నాలుగో స్థానానికి ఇక మనీశ్‌ పాండే ఖరారైనట్లే. హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై వన్డే ఆడలేదు. వారిద్దరికీ ఇది చక్కటి అవకాశం. ఇక ఆసీస్‌ను అనేక సార్లు ఆడుకున్న సీనియర్లు రోహిత్, ధావన్, కోహ్లి, ధోనిల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత వన్డే జట్టులో రహానే పాత్ర ఏమిటో కూడా ఈ సిరీస్‌లో తేలిపోవచ్చు.  

బౌలింగ్‌ బలహీనం...
వార్నర్, స్మిత్, ఫించ్, మ్యాక్స్‌వెల్‌... వన్డేల్లో విధ్వంసం సృష్టించేందుకు ఈ పేర్లు సరిపోతాయి. వీరికి స్టొయినిస్, హెడ్‌లాంటి కుర్రాళ్లు తోడయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ బలం అమాంతం పెరిగిపోతుంది. ఈ సిరీస్‌లో ఆసీస్‌ బలం ప్రధానంగా బ్యాటింగ్‌పైనే ఆధార పడి ఉంది. బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌తో మంగళవారం  జరిగిన మ్యాచ్‌లో అది కనిపించింది కూడా. ఈ ఏడాది ఆరంభంలో ఎరుపు బంతిని ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ వార్నర్, మ్యాక్స్‌వెల్‌ వన్డేల్లో మాత్రం వేదిక ఏదైనా స్టార్లే. అన్ని ఫార్మాట్‌లలో స్మిత్‌ నిలకడ ఆ జట్టును నిలబెడుతోంది. బౌలింగ్‌తో ఆ జట్టు ఏమాత్రం ప్రభావం చూపిస్తుందనేదే సందేహం. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న కమిన్స్, కూల్టర్‌ నీల్‌లే ఆసీస్‌ బలం కాగా...హాజల్‌వుడ్‌ భారత్‌లో ఎప్పుడూ వన్డేల్లో బౌలింగ్‌ చేయలేదు. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న లెగ్‌స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాపై ఆసీస్‌ ఆశలు పెట్టుకుంది. స్పిన్నర్‌ అగర్‌ అయితే కెరీర్‌లో ఆడిందే 2 వన్డేలు! భారత్‌ దుర్భేద్యమైన బ్యాటింగ్‌కు అడ్డుకునేందుకు ఇది సరిపోకపోవచ్చు. అయితే పోటీతత్వంలో, ప్రొఫెషనలిజంలో మేటి, ఢీ అంటే ఢీ అంటూ తలపడే ఆసీస్‌ను చిత్తు చేయగలిగితే మన జట్టుకు తిరుగుండదు.  

2013లో ఇక్కడ భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌ హోరాహోరీగా సాగేందుకు నాటి ఆసీస్‌ బౌలింగ్‌ బలగం కూడా కారణం. కానీ ఈ సారి అది కనిపించడం లేదు. వారి బ్యాటింగ్‌ చాలా బాగున్నా... భారత్‌ను నిలువరించే స్థాయిలో బౌలింగ్‌ కనిపించడం లేదు. స్పిన్నర్లకు ఏమాత్రం అనుభవం లేదు. భారత్‌ 4–1తో గెలుస్తుందని నా అంచనా. శ్రీలంకపై సిరీస్‌లో రాణించినా...ఆస్ట్రేలియాలాంటి ప్రత్యర్థితో ఆడితేనే అసలు సత్తా తెలుస్తుంది కాబట్టి భారత స్పిన్నర్లకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నా. ఈ సిరీస్‌లో ఆకట్టుకునే ఆటగాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
–వీవీఎస్‌ లక్ష్మణ్, భారత మాజీ ఆటగాడు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement