బాదలేకపోయారు | India vs Australia 1st T20: Aus beat Ind by 4 runs in a last-over thriller | Sakshi
Sakshi News home page

బాదలేకపోయారు

Published Thu, Nov 22 2018 1:20 AM | Last Updated on Thu, Nov 22 2018 5:37 AM

 India vs Australia 1st T20: Aus beat Ind by 4 runs in a last-over thriller - Sakshi

...టీమిండియా బోల్తా పడింది! బౌలింగ్‌లో నియంత్రణ లేక... ఫీల్డింగ్‌లో బంతిని పట్టలేక... బ్యాటింగ్‌లో హిట్టింగూ చేయలేక... ఆస్ట్రేలియా గడ్డపై పెద్ద మైదానాల్లో టి20 మ్యాచ్‌ సంక్లిష్టతలను అధిగమించలేక... ఓటమి పాలైంది. వీటన్నిటిని సరిగ్గా చేసిన కంగారూ జట్టు విజయాన్నందుకుంది. స్వయంకృతానికి తోడు వర్షం కూడా విరాట్‌ కోహ్లి సేనను కొంత దెబ్బతీసింది. ఆడిన ఓవర్ల మేరకు ప్రత్యర్థి కంటే ఎక్కువ స్కోరే చేసినా, డక్‌వర్త్‌ లూయీస్‌ నిబంధన ముందు నెగ్గడానికి అది సరిపోలేదు. ఫలితం... ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత్‌కు ఆసీస్‌ చేతిలో అనూహ్య పరాజయం.   

బ్రిస్బేన్‌: 6 బంతుల్లో 13 పరుగులు. చివరి ఓవర్లో టీమిండియా విజయ సమీకరణం ఇది. క్రీజులో ‘నిదహాస్‌ ట్రోఫీ’ ఫైనల్‌ ఆఖరి బంతి సిక్స్‌ వీరుడు దినేశ్‌ కార్తీక్‌ (13 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌)... ‘ఐపీఎల్‌ హిట్టర్‌’ కృనాల్‌ పాండ్యా (4 బంతుల్లో 2)... మీడియం పేసర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ బౌలింగ్‌. సాధారణంగా ఇవే పరిస్థితులు భారత్‌లో ఉంటే మన జట్టు గెలుపు నల్లేరుపై నడకే. కానీ, ఆస్ట్రేలియాలో ఈ పప్పులుడకలేదు. కార్తీక్, కృనాల్‌ షాట్లకు బంతి స్టాండ్స్‌లోకి కాకుండా ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లింది. దీంతో కోహ్లి సేన లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్‌ 1–0తో ముందంజ వేసింది. రెండు జట్ల మధ్య బుధవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (24 బంతుల్లో 46; 4 సిక్స్‌లు), స్టొయినిస్‌ (19 బంతుల్లో 33; 3 ఫోర్లు, సిక్స్‌); క్రిస్‌ లిన్‌ (20 బంతుల్లో 37; ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కుల్దీప్‌ యాదవ్‌ (2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా గంట సమయం కోల్పోవడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను, మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. అనంతరం డక్‌వర్త్‌ లూయీ స్‌ పద్ధతి ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 174 పరుగులుగా నిర్దేశించారు. ఓపెనర్‌  ధావన్‌ (42 బంతుల్లో 76; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడినా... దినేశ్‌ కార్తీక్, పంత్‌ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్‌) దూకుడు చూపినా... ఫినిషింగ్‌ లోపంతో టీమిం డియా మ్యాచ్‌ను చేజార్చుకుంది. స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా (2/22)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. రెండో టి20 శుక్రవారం మెల్‌బోర్న్‌లో జరుగనుంది. 

ఆ ముగ్గురు... 
తొలి ఐదు ఓవర్లు సాధారణంగా, తర్వాతి ఐదు ఓవర్లు కొంత వేగంగా, ఆట సాగిన మిగతా ఓవర్లు రాకెట్‌లా దూసుకెళ్లింది ఆసీస్‌ స్కోరు. ఓపెనర్లలో షార్ట్‌ (7)ను బౌలింగ్‌కు దిగుతూనే ఖలీల్‌ అహ్మద్‌ ఔట్‌ చేశాడు. కోహ్లి క్యాచ్‌ వదిలేయడంతో లైఫ్‌ దక్కిన కెప్టెన్‌ ఫించ్‌ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు)... లిన్‌తో కలిసి స్కోరును నడిపించాడు. ఖలీల్‌ బౌలింగ్‌లో విజృంభించిన లిన్‌ మూడు సిక్స్‌లు కొట్టాడు. అయితే, కుల్దీప్‌ వీరిద్దరినీ వరుస ఓవర్లలో పెవిలియన్‌ పంపి ఊరటనిచ్చాడు. జట్టు స్కోరు 75/3తో ఉన్న దశలో జత కలిసిన మ్యాక్స్‌వెల్, స్టొయినిస్‌ పరిస్థితిని మార్చేశారు. ఖలీల్, కృనాల్‌లను లక్ష్యంగా చేసుకుని చెలరేగారు. మ్యాక్స్‌వెల్‌ హ్యాట్రిక్‌ సిక్స్‌లతో కృనాల్‌కు చుక్కలు చూపాడు. వీరి ధాటికి అతడు రెండు ఓవర్లలోనే 40 పరుగులిచ్చాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 16.1 ఓవర్‌ వద్ద ఉండగా వర్షం మొదలైంది. విరామం తర్వాత తొలి బంతికే మ్యాక్స్‌వెల్‌ను బుమ్రా ఔట్‌ చేశాడు. మిగిలిన నాలుగు బంతుల్లో ప్రత్యర్థి ఐదు పరుగులు చేసింది. 

ఈ ముగ్గురు... 
ఓవర్‌కు పదికి పైగా రన్‌రేట్‌తో ఛేదనకు దిగిన భారత్‌కు బౌండరీల మీద బౌండరీలు బాదుతూ ధావన్‌ శుభారంభం ఇచ్చాడు. మరోవైపు స్వేచ్ఛగా ఆడలేక రోహిత్‌ శర్మ (8 బంతుల్లో 7) వికెట్‌ ఇచ్చేశాడు. అయినా, జోరు తగ్గించని ధావన్‌ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తూ 28 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. అవతలి ఎండ్‌లో పదేపదే జంపాపై ఆధిపత్యానికి యత్నించిన కేఎల్‌ రాహుల్‌ (12 బంతుల్లో 13; ఫోర్‌) స్టంపౌటయ్యాడు. జంపా... కోహ్లి (8 బంతుల్లో 4)ని సైతం పరీక్షకు గురిచేశాడు. రన్‌రేట్‌ పెరిగిపోతుండటంతో ముందుకొచ్చి ఆడబోయిన కెప్టెన్‌ షాట్‌ గురితప్పి క్యాచ్‌ ఇచ్చాడు. స్టాన్‌లేక్‌ వేసిన బౌన్సర్‌ను అద్భుత రీతిలో థర్డ్‌మ్యాన్‌ దిశగా పంపిన ధావన్‌... బౌండరీ లైన్‌ ముందు దొరికిపోవడంతో భారత్‌ మరింత కష్టాల్లో పడింది.  రిషభ్‌ పంత్, కార్తీక్‌ జత కలిసే సమయానికి లక్ష్యం 32 బంతుల్లో 68. ఆండ్రూ టై ఓవర్లో చెరో ఫోర్, సిక్స్‌ బాది 25 పరుగులు పిండుకుని ఈ సవాల్‌ను వారు అధిగమిం చేలానే కనిపించారు. అయితే, 10 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన స్థితిలో పంత్‌ స్కూప్‌ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. చివరి ఓవర్లో భారత్‌ 13 పరుగులు చేయలేక పోయింది.

టి20ల్లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ధావన్‌ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది ధావన్‌ 16 మ్యాచ్‌ల్లో 646 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి (2016లో 15 మ్యాచ్‌ల్లో 641 పరుగులు) పేరిట ఉన్న రికార్డును ధావన్‌ అధిగమించాడు. 

 ‘మ్యాక్సీ’మమ్‌... 
ఆసీస్‌ బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ ఆటే హైలైట్‌. తన సిక్స్‌లు పాత మ్యాక్స్‌వెల్‌ను గుర్తుకు తెచ్చాయి. అంతేగాక, 16వ ఓవర్‌లో అతడు కొట్టిన షాట్‌ మైదానంలో తిరిగే స్పైడర్‌ కెమెరాను తాకడం విశేషం. కార్తీక్‌ షాట్‌ను బౌండరీ లైన్‌ వద్ద  పట్టుకునేందుకు మ్యాక్స్‌వెల్‌ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది.

అయ్యో కృనాల్‌...
►ఐపీఎల్‌లో ముంబై తరఫున కీలక ఇన్నింగ్స్‌లతో ఆల్‌రౌండర్‌గా టీమిండియాలోకి వచ్చిన కృనాల్‌ పాండ్యాకు ఈ మ్యాచ్‌ చేదు జ్ఞాపకమే. బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్, స్టొయినిస్‌ ధాటికి ఆరు సిక్స్‌లు సహా ఏకంగా 55 పరుగులిచ్చిన అత డు... జట్టును గెలిపించాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చి ఏమీ చేయలేకపోయాడు. దీంతోపాటు టి20ల్లో చహల్‌ (64), జోగిందర్‌ శర్మ (57) తర్వాత అత్యధిక పరుగులిచ్చిన భారత బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 
ఈ పొరపాట్లే ఓడించాయి... 
►  బ్రిస్బేన్‌ మ్యాచ్‌లో టీమిండియాను పలు పొరపాట్లు పరాజయం పాలు చేశాయి. అవేం టంటే... ఆఖరి ఓవర్‌ తొలి బంతికి కృనాల్‌ 2 పరుగులు తీయకుండా సింగిల్‌తో సరిపెట్టుకుంటే దినేశ్‌ కార్తీక్‌కు స్ట్రయికింగ్‌ వచ్చేది. ఊపులో ఉన్న కార్తీక్‌ ముగించగలిగేవాడు. 
► గెలుపు అవకాశాలు సమంగా ఉన్న దశలో పంత్‌... స్కూప్‌ షాట్‌కు యత్నించి వికెట్‌ పారేసుకున్నాడు. అతడు ఉండుంటే స్టొయినిస్‌ ఓవర్‌ను ఎదుర్కొనడం సులువయ్యేది. 
​​​​​​​►  డెత్‌ ఓవర్లను చాలా పొదుపుగా వేసే బుమ్రా, భువీ చివరి కోటాకు దిగాల్సి ఉండగా వర్షం మొదలైంది. అంతకుముందు కృనాల్, ఖలీల్‌ ఓవర్లలో ఆసీస్‌ చేసిన పరుగులే వారి స్కోరును పైకి తీసుకెళ్లాయి. 
​​​​​​​►  ఫించ్‌ ఆరు పరుగుల వద్ద ఉండగా ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కోహ్లి జారవిడిచాడు.  ఖలీల్‌ బౌలింగ్‌లో కోహ్లి మిస్‌ ఫీల్డింగ్‌ కారణంగా ప్రత్యర్థికి 3 పరుగులు వచ్చాయి. 
​​​​​​​►    17వ ఓవర్‌ తొలి బంతికి స్టొయినిస్‌ క్యాచ్‌ను థర్డ్‌మ్యాన్‌లో ఖలీల్‌ వదిలేశాడు. ఆ వెంటనే వర్షం మొదలైంది. అప్పటికి స్టొయినిస్‌ ఔటై ఉంటే ‘డక్‌వర్త్‌’ సమీకరణం కొంతైనా మారేది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement